viveka murder case: మాజీ మంత్రి వివేకా హత్యతో లబ్ధిపొందిన తొలివ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు ఆరోపించారు. ముఖ్యమంత్రి కావడం కోసం బాబాయ్ హత్యను, కోడికత్తి కేసును తనకు అనుకూలంగా మార్చుకున్నాడని విమర్శించారు. వివేకా కుమార్తె సునీత.. సీబీఐకి ఇచ్చిన వాంగ్మూలంలో అవినాశ్ రెడ్డిని జగన్మోహన్ రెడ్డి ఎలా వెనకేసుకొచ్చాడో స్పష్టమైందన్నారు. సీబీఐ విచారణ జరిగితే ఏమవుతుంది.. అవినాశ్ రెడ్డి భాజపాలో చేరతాడన్న జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలు హత్యలో అతని పాత్రను తేటతెల్లం చేస్తున్నాయని స్పష్టం చేశారు. వివేకా హత్య గురించి జగన్మోహన్ రెడ్డి తనకు తెలియదంటే రాష్ట్ర ప్రజలే కాదు, అతని కుటుంబం కూడా నమ్మదన్నారు.
వారు ఏం సమాధానం చెబుతారు..
వివేకా హత్య కేసు విచారణ, సీబీఐ నమోదు చేస్తున్న వాంగ్మూలాలపై వై.ఎస్.విజయమ్మ, షర్మిలలు ఏం సమాధానం చెబుతారని నక్కా ఆనంద్ బాబు నిలదీశారు. ఇంటి హత్య గురించి నోరు విప్పకపోతే ఎలా అని ధ్వజమెత్తారు. వారు మౌనంగా ఉంటే.. వివేకానందరెడ్డి హత్యలో జగన్మోహన్ రెడ్డి పాత్రను, ప్రమేయాన్ని ఒప్పుకున్నట్టే అవుతుందన్నారు. సీబీఐ విచారణలో కీలక సాక్షులుగా ఉన్న దస్తగిరి, వివేకానందరెడ్డి కుమార్తె సునీత, ఆమె భర్తకు కేంద్రప్రభుత్వం భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. సీబీఐ విచారణలో సాక్షులుగా ఉన్నవారి వాంగ్మూలాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్న తరుణంలో.. రాష్ట్రంలో అధికారంలో ఉన్నవారు వాటిపై దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.