కడప జిల్లా కొండాపురం మండలం పి.అనంతపురం గ్రామంలో తెలుగుదేశం పార్టీ నిజనిర్ధరణ కమిటీ పర్యటించింది. మాజీమంత్రులు సోమిరెడ్డి, అమర్‌నాథ్ రెడ్డి, ఎమ్మెల్సీ బీటెక్ రవి, కేఈ ప్రభాకర్ తదితరులు గ్రామానికి చేరుకుని.... ఇటీవల గురుప్రతాప్‌రెడ్డి హత్యకు గురైన ప్రదేశాన్ని, గ్రామసభ నిర్వహించిన ప్రాంతాన్ని పరిశీలించారు. గ్రామస్థులు, మహిళలతో మాట్లాడారు. గండికోట పరిహారం పంపిణీలో అక్రమాలు జరుగుతున్నాయని ఎర్రగుడి, తాళ్ల ప్రొద్దుటూరు బాధితులు నేతల ఎదుట వాపోయారు. చెక్కుల మంజూరుకు అధికారులు డబ్బులు అడుగుతున్నారని ఆరోపించారు.
ప్రభుత్వ అవినీతిని ప్రశ్నిస్తే... హత్య చేసే స్థాయికి వైకాపా నేతలు ఎదిగారని మాజీమంత్రి సోమిరెడ్డి మండిపడ్డారు. తమ హయాంలో బాధితులకు పరిహారం పంపిణీలో ఆరోపణలు వస్తేనే ఆర్డీవోపై వేటు వేశామని, ప్రస్తుతం అవినీతికి పాల్పడుతున్నవారికి అండదండలు అందుతున్నాయని ఆరోపించారు. గురుప్రతాప్‌రెడ్డి హత్యతో.. ప్రశ్నిస్తే చంపేస్తామనే సంకేతాలు ఇస్తున్నారని ధ్వజమెత్తారు. ఆయన కుటుంబాన్ని తమ పార్టీ నేతలు కలవకుండా చేయడంలో ఆంతర్యేమంటని అమర్‌నాథ్‌రెడ్డి ప్రశ్నించారు.