కడప జిల్లా రాజంపేట, నందలూరు మండలాల్లో వరద బీభత్సానికి దెబ్బతిన్న గ్రామాలను, వరదల్లో మృత్యువాత పడిన బాధిత కుటుంబ సభ్యులను తెదేపా అధినేత చంద్రబాబు పరామర్శించారు. ఉదయం కడప విమానాశ్రయం(TDP chief Chandrababu visited ) నుంచి ప్రారంభమైన చంద్రబాబు పర్యటన.. రాత్రి 9 గంటల వరకు సాగింది. కడప విమానాశ్రయానికి భారీ సంఖ్యలో కార్యకర్తలు, అభిమానాలు తరలివచ్చి స్వాగతం పలికారు. రోడ్డు మార్గాన వెళ్లి రాజంపేట మండలం మందపల్లె, పులపుత్తూరు, గుండ్లూరు గ్రామాల్లో చంద్రబాబు పర్యటించారు. మందపల్లె, పులపుత్తూరు గ్రామాల్లో అధికారికంగా ఇప్పటివరకు 19 మంది మృతదేహాలను గుర్తించారు. మందపల్లెలో ఒకే కుటుంబంలో ఏడుగురు మృత్యువాత పడిన బాధిత కుటుంబం ఇంట్లోకి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. గ్రామాల్లో కలియ తిరుగుతూ... చెయ్యేరు నది ఉద్ధృతికి గురైన పంటలను పరిశీలించారు. నది ఒడ్డునే ఊరు ఉండటం.. ప్రవాహానికి సంబంధించి అధికారుల నుంచి సమాచారం లేకపోవడంతో భారీ ఆస్తి, ప్రాణనష్టం జరిగిందని చంద్రబాబు అన్నారు. చంద్రబాబు నాయుడు పర్యటనకు ప్రజల నుంచి అనూహ్య స్పందన లభించింది.
సీఎం గ్రామాల్లో తిరగకుండా గాల్లో తిరిగి వెళ్లిపోయారు..
గత ఏడాదే పింఛ, అన్నమయ్య ప్రాజెక్టులు తెగిపోయినపుడే మేల్కోని ఉంటే ఇపుడు ఈ తప్పిదం జరిగేది కాదని అన్నారు. ప్రకృతి వైపరిత్యాలను ఎవరూ ఆపలేరు.. కానీ ముందస్తుగా గ్రామస్తులను సురక్షిత ప్రాంతాలకు తరలించలేకపోవడం ప్రభుత్వ వైఫల్యమేనని చంద్రబాబు విమర్శించారు. దానికి బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలన్న తెదేపా అధినేత.. జరిగిన ప్రాణ నష్టంపై తక్షణమే ఉన్నతస్థాయి విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. తాను హుద్ హుద్ తుఫాను వచ్చినపుడు 8 రోజుల పాటు విశాఖలోనే ఉండి పునరుద్ధరణ పనులు పూర్తి చేసే వరకు నిద్రపోలేదన్న చంద్రబాబు.. ముఖ్యమంత్రి జగన్ గ్రామాల్లో తిరగకుండా గాల్లో తిరిగి వెళ్లిపోయారని విమర్శించారు.
40 మంది వరకు వరదల వల్ల చనిపోయినట్లు అంచనా ఉందన్న బాబు.. మృతుల కుటుంబాలకు విశాఖ పాలిమర్స్ తరహాలోనే కోటి రూపాయల చొప్పున పరిహారం(chandrababu demand ex gratia to floods victims) ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. తెలుగుదేశం పార్టీ తరపున మృతుల కుటుంబాలకు లక్ష రూపాయల చొప్పున పరిహారం, ఇళ్లు కోల్పోయిన వారికి 5 వేల రూపాయల చొప్పున పరిహారం ఇస్తామని చంద్రబాబు ప్రకటించారు. ఇపుడున్న అన్నమయ్య ప్రాజెక్టును మళ్లీ నిర్మించాలని ప్రభుత్వం భావిస్తే.. ప్రజలకు పునరావాసం కల్పించడం లేదంటే, ప్రాజెక్టుకు సిమెంట్ కాంక్రీటుతో రక్షణ గోడలు నిర్మించడం వంటి శాశ్వత చర్యలు చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. లేదంటే తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ పని తామే చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. మందపల్లె గ్రామాన్ని దత్తత తీసుకుని అభివృద్ధి చేస్తామన్నారు. భారీగా ప్రాణ, ఆస్థినష్టం జరిగినా అధికారులు ఎవ్వరూ పట్టించుకోవడం లేదని స్థానికులు వాపోయారు.