YS Viveka Murder Case Update: YS వివేకానందరెడ్డి హత్య కేసు విచారణ బదిలీపై సుప్రీంకోర్టు సోమవారం తీర్పు వెలువరించనుంది. కేసు విచారణను ఏపీ నుంచి వేరే రాష్ట్రానికి.. బదిలీ చేయాలని వివేకా కుమార్తె సునీత దాఖలు చేసిన పిటిషన్‌పై సోమవారం నిర్ణయం వెలువరించనున్నట్లు.. జస్టిస్ ఎం.ఆర్.షా ధర్మాసనం ప్రకటించింది. ధర్మాసనంలోని మరో జడ్జి అందుబాటులో లేనందున.. ఇవాళ తీర్పు ఇవ్వలేదని జస్టిస్ ఎం.ఆర్.షా ప్రకటించారు. మరోవైపు ఈ కేసులో నిందితుడు ఎర్ర గంగిరెడ్డి బెయిల్ రద్దు చేయాలని సీబీఐ దాఖలు చేసిన పిటిషన్‌పైనా విచారణను సోమవారానికి వాయిదా వేశారు.
ఇదీ జరిగింది: వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసును వేరే రాష్ట్రానికి బదిలీ చేయాలని ఆయన కుమార్తె సునీతారెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్‌లో సీబీఐ కీలక విషయాలను పేర్కొంది. వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో నిందితుడిగా ఉన్న డి. శివశంకర్‌రెడ్డిని 2021 నవంబర్ 18న పులివెందులలో మేజిస్ట్రేట్ ముందు హాజరు పరిచినప్పుడు కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి కోర్టు గదిలోకి ప్రవేశించి కేసు దర్యాప్తు అధికారిని అడ్డుకున్నారని సీబీఐ తెలిపింది. పెద్దఎత్తున అనుచరులను వెంటేసుకొని.. కోర్టు ప్రాంగణంలోకి వచ్చి నిందితుల్లో ఎ-5గా ఉన్న శివశంకర్రెడ్డికి అవినాష్ మద్దతు పలికినట్లు అఫిడవిట్‌లో సీబీఐ వివరించింది. శివశంకర్‌రెడ్డిని ఎందుకు అరెస్ట్ చేశావని దర్యాప్తు అధికారిని ప్రశ్నించినట్లు వెల్లడించింది.
దర్యాప్తు బృందం కోర్టు నుంచి బయటికి వెళ్లే సమయంలో అవినాష్‌రెడ్డి అనుచరులు అడ్డుకునే ప్రయత్నం చేశారని..అఫిడవిట్‌లో తెలిపింది. డి. శివశంకర్ రెడ్డి జ్యుడిషియల్ కస్టడీలో ఉండగా మేజిస్ట్రేట్ అనుమతి లేకుండానే కడప సెంట్రల్ జైలు నుంచి రిమ్స్ ఆసుపత్రికి తరలించారని వివరించింది. ఈ అంశంపై 2021నవంబర్ 25న పులివెందుల జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ తీవ్రంగా స్పందించారని పేర్కొంది. ఆంధ్రప్రదేశ్ జైళ్ల నిబంధనలు 1979ని ఉల్లంఘిస్తూ.. శివశంకర్ రెడ్డిని ఆసుపత్రికి ఎందుకు తరలించాల్సి వచ్చిందో వివరణ కోరుతూ జైలు సూపరిండెంట్‌కు షోకాజ్ నోటీసు జారీశారని తెలిపింది. కేసులో ఒక సాక్షి శ్రీనివాసరెడ్డి ఆత్మహత్య చేసుకున్నారని మరో సాక్షి గంగాధర్ రెడ్డి కూడా చనిపోగా... పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారని సీబీఐ పేర్కొంది. ఈ మేరకు 278 పేజీల అఫిడవిట్‌ను సుప్రీంకోర్టుకు సమర్పించింది.