Erra Gangireddy Bail Petition: వివేకా హత్య కేసులో మొదటి నిందితుడు ఎర్ర గంగిరెడ్డి బెయిల్ పిటిషన్‌పై తీర్పును సుప్రీంకోర్టు వాయిదా వేసింది. ఎర్ర గంగిరెడ్డికి కడప కోర్టు ఇచ్చిన డీఫాల్ట్ బెయిల్ ఉత్తర్వులను ఏపీ హైకోర్టు సమర్థించడాన్ని సవాల్ చేస్తూ సీబీఐ దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ ముగిసింది. ఈ కేసుకు సంబంధించి బెయిల్ రద్దు కోసం సీబీఐ దాఖలు పిటిషన్ పరిగణలోకి తీసుకున్న సుప్రీంకోర్టు విచారణ సమయంలో కీలక వ్యాఖ్యలు చేసింది.
ఏ రాష్ట్రాన్ని ఆదేశించాలి: గంగిరెడ్డి బెయిల్ రద్దుపై మళ్లీ విచారణ జరపాలని ఆదేశిస్తే తెలంగాణ హైకోర్టును ఆదేశించాలా? లేక ఏపీ హైకోర్టును ఆదేశించాలా? అంటూ న్యాయమూర్తి జస్టిస్ ఎంఆర్ షా అడిగారు. గంగిరెడ్డి బెయిల్ పొందేనాటికి అసలు విచారణే జరగలేదు.. కీలక విషయాలేమీ దర్యాప్తులో బయటకు రాలేదు కదా? అని న్యాయమూర్తి ప్రశ్నించారు. సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన తీర్పుల నేపథ్యంలో కేసు తీవ్రత నేపథ్యంలో డిఫాల్ట్ బెయిల్‌ను రద్దు చేయవచ్చని సుప్రీం ధర్మాసనం అభిప్రాయపడింది. గతంలో దర్యాప్తు చేసిన ఏపీ పోలీసులు గంగిరెడ్డికి డిఫాల్ట్ బెయిల్ రావడానికే చార్జిషీటు దాఖలుకు జాప్యం చేశారని అనుకోవడానికి ఆస్కారం ఉందని సుప్రీం కోర్టు పేర్కొంది. గంగిరెడ్డికి రాజకీయ పలుకుబడి ఉంది కాబట్టి.. ఏదైనా సాధ్యమయ్యే అవకాశాలున్నాయని ధర్మాసనం అభిప్రాయపడింది. ఏపీలో నెలకొన్న ప్రత్యేక పరిస్థితుల నేపథ్యంలోనే వివేకా హత్య కేసును తెలంగాణకు బదిలీ చేసిన అంశాన్ని కూడా ప్రస్తావించింది.