ఇడుపులపాయ ఆర్కే వ్యాలీలో PUC-1, PUC-2 విద్యార్థులు ధర్నాకు దిగారు. ట్రిపుల్ ఐటీ అకడమిక్ బ్లాక్-1 వద్ద బైఠాయించి.. న్యాయం కావాలంటూ నినదించారు. కనీస వసతులు కల్పించే వరకు పాత క్యాంపస్‌కు వెళ్లబోమని తేల్చిచెప్పారు. ఉన్నఫళంగా పాత క్యాంపస్‌లోకి వెళ్లాలంటూ శనివారం రాత్రి 9 గంటలకు డైరెక్టర్ కసిరెడ్డి సంధ్యరాణి చెప్పారని.. అప్పటినుంచి వివాదం చెలరేగిందని విద్యార్థులు తెలిపారు. 3 నెలలుగా కొత్త క్యాంపస్‌లో ఉంటున్నామని.. రాత్రికి రాత్రే లగేజీ, ఇతర సామగ్రిని ట్రాక్టర్లో పడేసి పాత క్యాంపస్‌కు తరలించారని వాపోయారు. విశ్రాంతి గదులు సరిగా లేకపోవడం, తలుపుల్లేని మరుగుదొడ్లు, ఇతర వసతులు లేవని... దీనివల్ల శనివారం రాత్రంతా నిద్ర కూడా లేదని ఆవేదన చెందారు. ఈ విషయం తెలుసుకుని ఆదివారం ఇడుపులపాయ వచ్చిన తల్లిదండ్రులు.. డైరెక్టర్ కసిరెడ్డి సంధ్యరాణిని నిలదీయడంతో ఆమె దురుసుగా ప్రవర్తించారని చెప్పారు.
ఆందోళనకు దిగిన విద్యార్థులపై డైరెక్టర్ కసిరెడ్డి సంధ్యారాణి ఆగ్రహంతో ఊగిపోయారు. ఈ క్రమంలో ధర్నాలో కూర్చున్న ఓ విద్యార్థిపై చేయి చేసుకున్నారు. ఈ చర్యను విద్యార్థులు తీవ్రంగా నిరసించారు. అందరూ గట్టిగా నినాదాలు చేశారు.
ఆ తర్వాత కూడా వెనక్కి తగ్గని డైరెక్టర్ కసిరెడ్డి సంధ్యారాణి... ట్రిపుల్ ఐటీకి సెలవులు ఇస్తున్నట్లు ప్రకటించారు. విద్యార్థులంతా వెంటనే ఇళ్లకు వెళ్లిపోవాలని... లేదంటే పోలీసుల సాయంతో బలవంతంగా పపించాల్సి ఉంటుందని హెచ్చరించారు.