Student Sohit Dead in school Hostel : ఆడుతూ పాడుతూ జీవించాల్సిన ఆరో తరగతి విద్యార్థి మృతితో వైఎస్సార్ జిల్లా ఉలిక్కిపడింది. పులివెందులకు చెందిన నాగరాజు, లలిత దంపతుల కుమారుడు సోహిత్ ఖాజీపేట మండలం కొత్తపేట వద్దగల బీరం శ్రీధర్ రెడ్డి పాఠశాలలో ఆరో తరగతి చదువుతున్నాడు. పాఠశాల హాస్టల్‌లోనే ఉంటున్న సోహిత్ శనివారం ఉదయం 5 గంటలకు తల్లిండ్రులకు ఫోన్ చేసి కడుపు నొప్పిగా ఉందని తెలిపాడు. కడపలోని బంధువులు పాఠశాలకు వచ్చేటప్పటికే సోహిత్‌ని బయట పడుకోబెట్టారు. హుటాహుటిన చెన్నూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. అప్పటికే సోహిత్ మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.
పాఠశాలపై కర్రలు, రాళ్లతో దాడి : సోహిత్ శరీరంపై పలు చోట్ల కమిలిన గాయాలు ఉండటంతో హాస్టల్ సిబ్బందే తమ కొడుకుని కొట్టి చంపారంటూ మృతదేహంతో పాఠశాల వద్దకు వచ్చారు. సిబ్బంది లోపలికి అనుమతించకపోవడంతో గేటు దూకి లోపలికి వెళ్లి వారిపై చేయి చేసుకున్నారు. కర్రలు, రాళ్లతో దాడి చేశారు. పులివెందుల నుంచి కుటుంబ సభ్యులు, బంధువులు వచ్చేసరికి పాఠశాల యాజమాన్యం అక్కడి నుంచి పరారైంది. దీంతో పాఠశాల ఆవరణలో కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. విద్యార్థి సంఘాలు కూడా వీరికి మద్దతు పలికాయి. ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడటంతో పోలీసులు వారిని చెదరగొట్టారు. మైదుకూరు సీఐ నరేంద్రరెడ్డి ఓ వృద్ధుణ్ని పట్టుకొని నెట్టేయడంతో ఆయన కింద పడ్డారు.
'జాయిన్ చేసి రెండు వారాలు అయ్యింది. ఉదయం ఐదు గంటలకు ఫోన్ చేసి కడుపునొస్తుందని చెప్పాడు. రాత్రి రాని కడుపు నొప్పి ఉదయానికి ఎలా వచ్చింది? సిక్ రూమ్‌కి కూడా వెళ్లలేదు. మేము జాయిన్ చేసినప్పుడు గాయాలు లేవు. మా బాబు శరీరంపై గాయాలు ఎలా వచ్చాయి. పోస్ట్‌మార్టంకి తీసుకెళ్తామంటున్నారు. అక్కడ మానిప్యులేట్ చేస్తారు.'- బ్రహ్మయ్య, సోహిత్ చిన్నాన్న