రాష్ట్ర ఎన్నికల ప్రధాన కార్యాలయం నుంచి ఎన్నికల ప్రధానాధికారి విజయానంద్... బద్వేల్ ఉప ఎన్నికను వెబ్ కాస్టింగ్ ద్వారా పర్యవేక్షిస్తున్నారు. 281 పోలింగ్ కేంద్రాల్లోనూ ఉప ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయని ఆయన తెలిపారు. ఇప్పటివరకు ఎక్కడా అవాంఛనీయ సంఘటనలు జరగలేదని వెల్లడించారు.
మూడు చోట్ల మాక్ పోలింగ్‌లో ఈవీఎంలో సమస్య వచ్చిందని.. వాటిని అప్పటికప్పుడే పరిష్కరించామని తెలిపారు. ఇప్పటివరకు ఎక్కడా కూడా పోలింగ్ ఆగలేదని పేర్కొన్నారు. దొంగ ఓట్లు వేస్తున్నారని, ఇతర ప్రాంతాల నుంచి వ్యక్తులు వస్తున్నారన్నది అవాస్తవమని తేల్చి చెప్పారు. ఇప్పటివరకు అలాంటి ఫిర్యాదులు ఎన్నికల సంఘానికి అందలేదని విజయానంద్ స్పష్టం చేశారు.