దేశంలోని అన్ని ఆలయాలలో శ్రీరామనవమి రోజున సీతారాముల కల్యాణం జరిగితే... కడప జిల్లా ఒంటిమిట్టలో మాత్రం పౌర్ణమికి ముందు వచ్చే చతుర్దశి రోజున వివాహ వేడుకను నిర్వహించటం ఆనవాయితీగా వస్తోంది. ఈ వేడుకను చూసేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలిరానున్నారు. 2 లక్షల మంది హాజరైనా సమస్య రాకుండా అధికారులు ఏర్పాట్లు చేశారు.
కోదండరాముని కల్యాణం చూతము రారండి - utsavalu
రెండో భద్రాద్రిగా పేరుగాంచిన కడప జిల్లా ఒంటిమిట్టలో.. కోదండరాముని కల్యాణానికి ఏర్పాట్లు పూర్తి కావొచ్చాయి. ఏప్రిల్ 18.. గురువారం చతుర్దశి.. రాత్రి 8 గంటల నుంచి 10 గంటల వరకు సీతారాముల వివాహ క్రతువును.. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో వైభవంగా నిర్వహించనున్నారు.
భక్తులకు అసౌకర్యం కలగకుండా సుమారు 52 ఎకరాల్లో జర్మన్ షెడ్లను ఆలయ సిబ్బంది సిద్ధం చేశారు. గత ఏడాదిలా.. గాలిదుమారం, భారీ వర్షం వచ్చినా వేడుకలకు అంతరాయం కలగకుండా.. భక్తులు ఇబ్బంది పడకుండా చర్యలు తీసుకున్నారు. విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగకుండా జనరేటర్లను సిద్ధం చేశారు.
కల్యాణోత్సవానికి పోలీసుశాఖ పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తోంది. జిల్లా ఎస్పీ అభిషేక్ మొహంతి ఏర్పాట్లను పర్యవేక్షించారు. కల్యాణ వేదిక వద్ద, చుట్టుపక్కల సీసీ కెమరాలు ఏర్పాటు చేశారు. ఆలయ సిబ్బంది... భక్తులకు మజ్జిగ, మంచినీటి సదుపాయాన్ని కల్పించారు. మొబైల్ టాయిలెట్లను ఏర్పాటు చేశారు. సుమారు 2 లక్షల ముత్యాల తలంబ్రాల ప్యాకెట్లను అందుబాటులోకి తెస్తున్నారు.