Awareness on Plastic Recycling: కడప జిల్లా ప్రొద్దుటూరులోని శ్రీవెంకటేశ్వర డిగ్రీ కళాశాల ప్లాస్టిక్ పునర్వినియోగం దిశగా వినూత్నంగా ఆలోచించింది. రీసైక్లింగ్ ఆఫ్ ప్లాస్టిక్ గురించి విద్యార్థులకు బోధించి.. వాడి పడేసిన ప్లాస్టిక్‌ను మళ్లీ వినియోగించుకునేలా ప్రాజెక్టు రూపొందించాలన్నారు. చేసే ఏ పనైనా నలుగురుకి ఉపయోగపడేలన్న ఉద్దేశంతో విద్యార్థులు వినూత్నంగా ఆలోచించారు.
పట్టణంలోని వీధుల్లో తిరిగి ప్లాస్టిక్ వ్యర్థాల గురించి అవగాహన పెంచుకున్నారు. అలాంటి వాటిని తిరిగి వినియోగించుకొని.. వివిధ రకాల వస్తువులు తయారుచేయాలని నిర్ణయించుకున్నారు. అధ్యాపకుల సహకారంతో బృందాలుగా ఏర్పడి ఆలోచనలు పంచుకున్నారు. ఉదయం కళాశాలలకు హాజరై మధ్యాహ్నం ప్లాస్టిక్ సేకరించేవారు. రెండు వారాలకుపైగా శ్రమించి వస్తువులను తయారు చేయడం మొదలుపెట్టారు.
ప్లాస్టిక్ పునర్‌వినియోగం.. గృహాలంకరణ వస్తువులు తయారీ నిత్యం మనం వాడే నీళ్ల సీసాలు, శీతల పానీయాల బాటిళ్లు, ప్లాస్టిక్ చెంచాలు, గ్లాసులు, స్ట్రాలు, కవర్లు వంటి ప్లాస్టిక్ వస్తువులను సేకరించారు. వాటితో ఇంట్లో అలంకరణల కోసం వాడే వివిధ గృహాలంకరణ వస్తువులు తయారుచేశారు. అవి అందంగా కనిపించేలా రంగులు అద్దారు. ప్లాస్టిక్ చెంచాలతో బొమ్మలు, అద్దాలు.. కవర్లతో పువ్వులు తయారుచేశామని విద్యార్థులు అంటున్నారు. వాడి పడేసిన బాటిళ్లతో బెడ్‌లైట్ వంటివి ఎన్నో తయారు చేశామన్నారు. పడేసిన ప్లాస్టిక్ తిని జంతువులు మరణిస్తున్నాయని.. అలా కాకుండా వాటిని మళ్లీ వాడుకునేలా ఈ ప్రాజెక్టు అవగాహన కల్పిస్తోందంటున్నారు.
ప్లాస్టిక్ వినియోగం పెరిగేకొద్దీ వాతావరణంలోనూ అనేక మార్పులు వస్తున్నాయి. రానున్న రోజుల్లో ప్లాస్టిక్ ముప్పు మరింత పెరిగే అవకాశం ఉన్నందున.. ప్రజల్లో అవగాహన కల్పించడానికి తాము ఈ ప్రాజెక్టు రూపొందించినట్లు విద్యార్థులు చెబుతున్నారు. ప్లాస్టిక్ వల్ల కలిగే ఇబ్బందులతోపాటు పునర్వినియోగంపై ప్రజలకు అవగాహన కల్పించాలని విద్యార్థులు అంటున్నారు. ప్రజల్లో చైతన్యం కోసం మరింత కృషి చేయాలని చెబుతున్నారు.
ఇదీ చదవండి:బస్సులో భోంచేద్దాం రండి..