కడప జిల్లాలో పరిషత్ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. మొత్తం 26 మండలాల పరిధిలోని 12 జడ్పీటీసీ, 117 ఎంపీటీసీ స్థానాలకు గురువారం ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఎన్నికలు నిర్వహించారు. చివరి గంటలో కొవిడ్ బాధితులు, అనుమానితులకు ఓటు వేసే అవకాశం కల్పించారు. పోలింగ్ ముగిసే నాటికి మొత్తం ఓటర్లు 4,79,752 మందికిగానూ 3,05,074 మంది మాత్రమే తమ ఓటుహక్కు వినియోగించుకున్నారు. ఈ లెక్కన కేవలం 63.59 శాతం పోలింగ్ నమోదైంది.
జిల్లాలో నందలూరు మండలంలో అత్యధికంగా 80.61, పోరుమామిళ్లలో అత్యల్పంగా 39.50 శాతం పోలింగ్ నమోదైంది. పరిషత్తు ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లు తెదేపా అధినేత నారా చంద్రబాబునాయుడు ప్రకటించడంతో చాలా పోలింగ్ కేంద్రాల్లో కూర్చోవడానికి తెదేపా ఏజెంట్లు ముందుకు రాలేదు. స్థానిక పరిస్థితులను బట్టి కొన్నిచోట్ల తెదేపా అభ్యర్థులు పోటీలో నిలవడంతో ఆయా చోట్ల మాత్రమే పార్టీ ఏజెంట్లు హాజరయ్యారు. అత్యధిక స్థానాలు ఏకగ్రీవం కావడం, ప్రధాన ప్రతిపక్ష పార్టీ ఎన్నికల బహిష్కరించడం, భానుడి భగభగలు, తదితర కారణాలతో చాలా మంది ఓటేయకుండా ఇళ్లకే పరిమితమయ్యారు.
వాగ్వాదాలు...ఆందోళనలు
పరిషత్తు ఎన్నికల సందర్భంగా జిల్లాలో కొన్ని చోట్ల వాగ్వాదాలు, ఆందోళనలు జరిగాయి. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
● బద్వేలు మండలం ఉప్పటివారిపల్లెలోని పోలింగ్ కేంద్రంలోకి తెదేపా ఏజెంట్లను అనుమతించకపోవడంపై ఆ పార్టీ జడ్పీటీసీ అభ్యర్థి బీరం శిరీష ఆందోళనకు దిగారు. అక్కడే నేలపై కూర్చుని ఆమె నిరసన తెలిపారు. అనంతరం అధికారులు స్పందించి పోలింగ్ కేంద్రంలో తెదేపా ఏజెంట్లను కూర్చోనివ్వడంతో ఆమె ఆందోళన విరమించారు.
● రైల్వేకోడూరు మండలం మైసూరివారిపల్లెలో పోలింగ్ అధికారులు తమతో నిర్లక్ష్యంగా మాట్లాడారని ఆరోపిస్తూ కొంతమంది ఓటేయకుండానే వెనక్కి వెళ్లిపోయారు. ఈ క్రమంలో జనసేన, వైకాపా వర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. పోలీసులు ఇరువర్గాలకు సర్దిచెప్పి పంపించేశారు.