మా బడి ఎంత బాగుంటుందో.. మీరూ చూస్తారా! - special school in venkatapuram kadapa district
పచ్చని చెట్లు.. ఆహ్లాదకర వాతావరణం.. లోపలికి అడుగుపెట్టగానే స్వాగతం పలికే గోడ చిత్రాలు.. స్ఫూర్తినిచ్చే మహాత్ముల చిత్రపటాలు.. అక్కడికి వెళ్లిన వారిని సాదరంగా స్వాగతిస్తాయి. కడప జిల్లా వెంకటాపురం ప్రాథమిక పాఠశాల ప్రత్యేకత ఇది.
కడప జిల్లా మైదుకూరు పురపాలక పరిధిలోని వెంకటాపురం ప్రాథమిక పాఠశాలలో 35 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. తమ బడి మిగతావాటికంటే భిన్నంగా ఉండాలని వారు కోరుకున్నారు. ఉపాధ్యాయుల ప్రోత్సాహం, దాతల సహకారంతో ఆ పనికి శ్రీకారం చుట్టారు. ముందుగా పాఠశాల భవనానికి మరమ్మతులు చేయించారు. ఆవరణలో చెట్లు నాటారు. బడి గోడలపై స్ఫూర్తినిచ్చే చిత్రాలు వేయించారు. అలా పాఠశాల రూపురేఖలే మార్చేశారు. తమ పిల్లలను కాన్వెంట్లో చదివించే గ్రామస్థులు.. ఇప్పుడు ఆ ప్రాథమిక పాఠశాలకే పంపిస్తున్నారు. బడి అంటే దేవాలయం అన్న మాటలను యథాతథంగా పాటిస్తూ.. తమ పాఠశాలను గుడిగా మార్చుకున్న ఆ విద్యార్థులు ఎందరికో ఆదర్శం.