కడప జిల్లా జమ్మలమడుగు మండలం యస్. ఉప్పలపాడు గ్రామంలో 1,869 మంది ఓటర్లు ఉన్నారు. ఒకప్పుడు.. సౌకర్యాల లేమితో అల్లాడుతున్న ఈ ఊరిని ఐఏఎస్ విజయానంద్, రామకృష్ణారెడ్డి సేవాశ్రమం నిర్వాహకులు రామ్ మనోహర్ రెడ్డి దత్తత తీసుకున్నారు. అప్పటి గ్రామ సర్పంచ్ రూతమ్మ, ప్రభుత్వం సూచించిన 20 అంశాల పైన దృష్టి సారించి అభివృద్ధికి కృషి చేశారు. ఈ క్రమంలో ప్రతి వీధికి సిమెంట్ రోడ్డు.. సుమారు 50 లక్షలతో ఆలయ సముదాయం నిర్మించారు. ప్రభుత్వ పాఠశాలలో అన్ని సదుపాయాలతో పాటు ఆంగ్ల మాధ్యమాన్ని అందుబాటులోకి తెచ్చారు.
గ్రంథాలయం, పశు వైద్యశాల, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, గ్రామ సచివాలయం.. ఇలా అన్ని సదుపాయాలను మెరుగైన వసతులతో తీర్చిదిద్దారు. సినీ దర్శకుడు శేఖర్ కమ్ముల.. ఇక్కడి ప్రాథమిక ఆరోగ్య కేంద్ర అభివృద్ధికి రూ. 2 లక్షలు విరాళంగా ఇచ్చారు. గ్రామాలకు అనుసంధానంగా మట్టి రోడ్లు, వంద ఎల్ఈడీ బల్బులతో వీధి దీపాలు ఏర్పాటు చేశారు. 350 వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించి బహిరంగ మల మూత్ర విసర్జన రహిత గ్రామంగా గత తెదేపా ప్రభుత్వం ప్రకటించింది. ఫలితంగా.. 2019 జనవరిలో స్మార్ట్ విలేజ్ గా రాష్ట్రంలో ఉప్పలపాడు మూడో స్థానంలో నిలిచింది.