"రాష్ట్రంలో అరాచక పాలన చేస్తున్న వైకాపా ప్రభుత్వాన్ని, జగన్మోహన్రెడ్డిని నిలువరించే సత్తా ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలోని భాజపాకు మాత్రమే ఉంది" అని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు పేర్కొన్నారు. శనివారం సాయంత్రం కడప జిల్లా జమ్మలమడుగులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన.. ఆనాడు ఇందిరా గాంధీ దేశంలో ఎమర్జెన్సీ విధిస్తే.. నేడు అధికారం అడ్డంగా పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి మళ్లీ చీకటి రోజులను గుర్తుచేస్తున్నారని దుయ్యబట్టారు.
మున్సిపల్ ఎన్నికల్లో పోలీసు, రెవెన్యూ అధికారులను అదుపులో పెట్టుకుని ఇతర పార్టీలకు చెందిన నాయకులను వేధిస్తూ ఎస్సీ,ఎస్టీ కేసులు బనాయిస్తున్నారని ఆరోపించారు. ఈ వ్యవస్థను, పరిస్థితులను చక్కదిద్దే బాధ్యత ప్రధాని మోదీకి మాత్రమే ఉందని ఆయన తెలిపారు.