కడప జిల్లా మైలవరం మండలంలో నిర్మిస్తున్న సోలార్ పవర్ ప్రాజెక్టు కోసం.. భూములు కోల్పోయిన నిర్వాసితులు పరిహారం కోసం అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తూనే ఉన్నారు. ఏపీఎస్పీసీఎల్ సంస్థ 2016లో మైలవరం మండలంలోని వద్దిరాల, దొడియం, పొన్నంపల్లె, రామచంద్రయ్యపల్లె, కోన అనంతపురం గ్రామాల్లోని రైతుల నుంచి.. ఆరు వేల ఎకరాలు సేకరించింది. ఇందులో 5 వేల 7 వందల ఎకరాలు ప్రభుత్వ భూమి కాగా.. మిగిలిన 300 ఎకరాలు డీకేటీ పట్టా భూములు ఉన్నాయి. ఈ డీకేటీ పట్టా భూములకు ఎకరాకు 6 లక్షల నుంచి ఏడున్నర లక్షలుగా పరిహారాన్ని నిర్ణయించారు. వెయ్యి మెగా వాట్ల విద్యుత్ ఉత్పత్తి లక్ష్యంగా సోలార్ ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తున్నారు. పట్టా భూములకు పరిహారం చెల్లించిన అధికారులు, 85 ఎకరాల్లోని డీకేటీ భూములకు పరిహారం ఇంతవరకు చెల్లించలేదు.
సోలార్ ప్లాంట్ రైతులకు అందని పరిహారం
కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గంలోని సోలార్ ప్లాంట్‌కు భూమిలిచ్చిన రైతులు.. పరిహారం కోసం కాళ్లరిగేలా తిరుగుతున్నారు. మూడేళ్ల కిందట బాధిత రైతుల భూములు స్వాధీనం చేసుకున్న రెవిన్యూ అధికారులు.. ఇంతవరకూ పరిహారం ఇవ్వకపోవడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ప్రస్తుతం 250 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి సౌరపలకలు అమర్చడం పూర్తైంది. ఉత్పత్తి ప్రారంభమైనా తమకు పరిహారం ఇవ్వలేదంటూ 85 ఎకరాల్లోని డీకేటీ భూముల యజమానులు డిమాండ్ చేస్తున్నారు. ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి ఆధ్వర్యంలో కలెక్టర్ హరికిరణ్‌ను కలిసిన 43 మంది రైతులు.. తమకు పరిహారం చెల్లించాలని తమ గోడు వెళ్లబోసుకున్నారు.
రాజకీయ కారణాలతో బాధితులను నిర్లక్ష్యం చేయవద్దన్న ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి.. సమస్యను వెంటనే పరిష్కరిచాలని కలెక్టర్‌ను కోరారు. సోలార్ ప్లాంట్ బాధితుల సమస్యలపై వెంటనే స్పందించిన జిల్లా కలెక్టర్ హరికిరణ్.. రెండ్రోజుల్లో సమస్య పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. బాధిత గ్రామాలకు వెళ్లి విచారణ చేసి నివేదిక ఇవ్వాలని ప్రత్యేక అధికారి బాలగణేశ్‌కు ఆదేశాలు జారీ చేశారు.