కడప జిల్లా సిద్ధవటం చెందిన రామచంద్ర కుటుంబం చాలా ఏళ్లుగా తిరుపతిలో నివసిస్తున్నారు. ఏడాది కిందట రామచంద్ర చనిపోయారు. ఏడాది కర్మకాండ కార్యక్రమానికి తిరుపతి కుర్లకుంట ప్రాంతం నుంచి రామచంద్ర భార్య, పిల్లలు స్వగ్రామానికి వచ్చారు. వారితో పాటు రామచంద్ర కుమారుడు వెంకట శివకుమార్ స్నేహితులు సిద్ధవటం వచ్చారు. అంతా కలిసి 11 మంది వరకు ఉన్నారు. గురువారం మధ్యాహ్నం కర్మకాండ పూర్తి చేసుకుని భోజనాలు చేశారు. అనంతరం 8 మంది యువకులు దగ్గర్లోని పెన్నా నదిలో ఈతకు వెళ్లారు.
వెంకటశివకుమార్ అనే వ్యక్తిని కొందరు యువకులు నీటిలో ముంచుతూ ఈత కొడుతున్నారు. దీంతో వెంకటశివ కేకలు వేయడంతో బయట ఉన్న నాగూర్ బాషా వచ్చి అతడ్ని ఒడ్డుకు తీసుకొచ్చారు. మిగిలిన ఏడుగురు అలాగే నడము లోతున్న నీటిలో ఈత కొడుతూ... ఒక్కసారిగా గల్లంతయ్యారు. పెన్నానది లోపల ఇసుక మేటలు ఉన్నాయి. ఇసుక నీళ్లలోకి జారి పోవడంతో ఏడుగురు యువకులు గల్లంతయ్యారు. వారంతా తిరుపతి చెందిన వారని, డిగ్రీ చదువుతున్నారని పోలీసులు తెలిపారు. జగదీష్, తరుణ్, సతీశ్, షణ్ముఖం, యశ్వంత్, రాజేష్, సోమశేఖర్ అనే యువకులు గల్లంతయ్యారు. పోలీసులకు సమాచారం రావడంతో గజ ఈతగాళ్లతో గాలింపు చర్యలు చేపట్టారు. రాత్రికి రాజేశ్, సోమశేఖర్ మృతదేహాలు వెలికి తీశారు. మిగిలిన ఐదుగురు యువకుల కోసం గాలిస్తున్నారు. వర్షం పడటంతో గాలింపు చర్యలకు ఆటంకం ఏర్పడింది. రాజంపేట డీఎస్పీ శివభాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో సహాయ చర్యలు కొనసాగుతున్నాయి.