కడప జిల్లా రాయచోటి పురపాలికలో ఇప్పటికే మూడు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అయినప్పటికీ ఇక్కడ పారిశుద్ధ్య పనులు చేపట్టడంలో అధికారుల నిర్లక్ష్యం కనిపిస్తోంది. 1.20 లక్షల జనాభా ఉన్న పురపాలికలో తరచూ శుభ్రపరచాలి. కానీ రాయచోటిలోని కొన్ని ప్రాంతాల్లో రెండు, మూడు రోజులైనప్పటికీ చెత్తకుండీలను శుభ్రం చేయడం లేదు.
వీధుల్లో చెత్త కింద పడటంతో పందులు సంచరిస్తూ దుర్వాసన వెదజల్లుతున్నాయి. ఫలితంగా వ్యాధులు ప్రబలుతాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పట్టణంలోని ఎస్ఎన్ కాలనీలో వారం రోజులుగా చెత్త కుండీలను శుభ్రం చేయకపోవటంతో చెత్త పేరుకుపోయి దుర్గంధం వెలువడుతోందని కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉన్నతాధికారులు చొరవ తీసుకుని పట్టణం పరిశుభ్రంగా ఉండేలా చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.