ఇసుక యార్డ్‌లలో పనిచేస్తున్న ఒప్పంద ఉద్యోగులకు గనుల శాఖ ముఖ్య కార్యదర్శి ద్వివేది తక్షణమే క్షమాపణ చెప్పాలని ఏఐటీయూసీ కడప జిల్లా అధ్యక్షుడు నాగ సుబ్బారెడ్డి డిమాండ్ చేశారు. ఇసుక దందాకు ఇసుక యార్డ్‌లో పనిచేస్తున్న ఒప్పంద ఉద్యోగులే కారణమని ద్వివేది అన్న మాటలను నిరసిస్తూ కడప కలెక్టరేట్ ఎదుట ఇసుక యార్డ్‌లో పనిచేస్తున్న ఉద్యోగులు నిరసన వ్యక్తం చేశారు. ఇసుక అక్రమాలకు సంబంధించి అధికారులపై నిందలు వేయడం మంచి పద్ధతి కాదన్నారు.
రేయింబవళ్లు ఇసుక రీచ్‌ల్లో పనిచేస్తున్నా.. గత రెండు నెలల నుంచి జీతాలు ఇవ్వడం లేదంటూ ఉద్యోగస్థులు ఆరోపించారు. రెండేళ్లుగా ఇసుక యార్డ్‌లలో పనిచేస్తున్న కార్మికులను ఇప్పుడు తొలగించడం సమంజసం కాదని అన్నారు. ప్రభుత్వం తీసుకువస్తున్న విధి విధానాల వల్ల అవస్థలు ఎదురవుతున్నాయని.. ఉన్నఫళంగా 360 మందిని విధుల నుంచి తొలగించడం దారుణమని చెప్పారు. ప్రభుత్వ తీరు మారకుంటే.. ఉద్ధృత ఉద్యమం చేస్తామని చెప్పారు.