YSR district sand danda update: సీఎం సొంత జిల్లాలో అధికార పార్టీ నేతలు ఇసుక దందాతో రెచ్చిపోతున్నారు. కమలాపురం నియోజకవర్గంలోని తప్పెట్లలో వైసీపీ నాయకులు, గుత్తేదార్లు ఇష్టారాజ్యంగా నిత్యం వందల సంఖ్యలో టిప్పర్లు, ట్రాక్టర్లతో ఇసుక తరలిస్తున్నారు. ఈ అక్రమ రవాణాపై వైసీపీకే చెందిన సర్పంచ్ న్యాయస్థానాన్ని ఆశ్రయించడం చర్చనీయాంశమైంది.
ధనార్జనే లక్ష్యంగా పెట్టుకున్న వైసీపీ నేతలకు ఇసుక దందా ఆదాయ వనరుగా మారింది. వైఎస్ఆర్ జిల్లా కమలాపురం నియోజకవర్గం తప్పెట్ల సమీపంలోని చెరువుకింద పల్లె వద్ద ఇసుక క్వారీ మంజూరైంది. జేపీ వెంచర్స్ అనుమతులు తీసుకున్నా.. ఉపగుత్తేదార్ల అవతారం ఎత్తిన వైసీపీ నాయకులు ఇష్టారాజ్యంగా ఇసుక తరలిస్తున్నారు. రోజుకు దాదాపు 500 ట్రిప్పుల ఇసుకను తోడేస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. నిలదీస్తే సంక్షేమ పథకాలు నిలిపేస్తామని బెదిరిస్తున్నారంటున్నారు.
రేయింబవళ్లు విరామం లేకుండా ఇసుక వాహనాలు తిరగడంతో తప్పెట్ల గ్రామస్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాత్రి వేళ ఇసుక తరలిస్తున్న వాహనాల్ని మహిళలు అడ్డుకుని నిరసన తెలిపినా ఎలాంటి ప్రయోజనం లేదని వాపోతున్నారు. వైసీపీ నేతలు కావడంతో అధికారులు సైతం చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారని మండిపడుతున్నారు. అక్రమ రవాణాను ప్రశ్నిస్తే కేసులు పెడతామని భయపెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.