రాష్ట్ర విభజన తర్వాత ఏపీఎస్ఆర్టీసీలో పనిచేసే సిబ్బంది, కార్మికుల ఆరోగ్యం కోసం అన్ని జిల్లాల్లో డిస్పెన్సరీలు పని చేస్తున్నాయి. విజయవాడలో మాత్రం ఆసుపత్రి నడుస్తోంది. రాష్ట్రంలోని ఆర్టీసీ సిబ్బందిలో ఎవరికి మేజర్ చికిత్స, సర్జరీ అవసరమైనా విజయవాడకు తరలించేవారు. దీన్ని అధిగమించేందుకు కడప నగరంలో ఆధునిక హంగులతో 3 కోట్ల 80 లక్షల రూపాయల వ్యయంతో.. సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మించారు. ఇప్పటికే ఈ ఆసుపత్రి నిర్మాణ పనులు దాదాపు పూర్తయ్యాయి.
లక్ష మందికి ఈ ఆసుపత్రి ద్వారా వైద్య సేవలు..
రాయలసీమ నాలుగు జిల్లాలతో పాటు నెల్లూరు జిల్లాకు చెందిన 25 వేల మంది ఆర్టీసీ సిబ్బంది.. కార్మికుల కోసం ఈ ఆసుపత్రి నిర్మించారు. 20 పడకల ఆసుపత్రికి రెండేళ్ల కిందట శంకుస్థాపన చేయగా.. ఇప్పుడు పూర్తి చేశారు. 25 వేల మంది సిబ్బందితో పాటు.. వారి కుటుంబ సభ్యులు కలిపి దాదాపు లక్ష మందికి ఈ ఆసుపత్రి ద్వారా వైద్య సేవలు అందే అవకాశం ఉంది. ఈ నెలలో సీఎం జగన్ జిల్లాకు వస్తున్న సందర్భంలో.. కడపలోని ఆర్టీసీ ఆసుపత్రిని ప్రారంభిస్తారని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ నేపథ్యంలోనే.. ఆర్టీసీ ఎండీ ఆర్పీ ఠాకూర్ కడపలో పర్యటించారు. ఆసుపత్రిలో వసతులు, పరికరాలు, పనులు ఎంతవరకు వచ్చాయనే దానిపై.. సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు.