ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం వల్లనే కరోనా సమయంలో కార్మికులకు జీతాలు ఇవ్వగలిగామని సంస్థ ఎండీ ద్వారకా తిరుమల రావు పేర్కొన్నారు. ప్రస్తుతం ఆర్టీసీ నష్టాల్లో నడుస్తోందని చెప్పారు. అయినప్పటికీ రాబడిలో ఇతర రాష్ట్రాలతో పోల్చుకుంటే ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీ ముందంజలో ఉందని తెలిపారు. కడప జిల్లా పర్యటనలో భాగంగా మధ్యాహ్నం కడప ఆర్టీసీ ఏరియా ఆస్పత్రిని ద్వారకా తిరుమల రావు తనిఖీ చేశారు.
ఆస్పత్రిలో మినరల్ వాటర్ ప్లాంట్ను ప్రారంభించారు. ఆవరణలో మొక్కలు నాటారు. వైద్యం పొందుతున్న రోగులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. కరోనా సమయంలో ఆర్టీసీ కార్మికులు మృతి చెందడం చాలా బాధాకరమని ఆవేదన చెందారు. అయినా ఎంతో చిత్తశుద్ధితో విధులు నిర్వహించారని ఆయన కితాబిచ్చారు. కార్మికుల సంక్షేమానికి ఎల్లపుడూ కృషి చేస్తామన్నారు.