కరోనా ఉధ్ధృతికి రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోయింది. కడప జిల్లా ఆర్టీసీకి భారీగా నష్టం వాటిల్లింది. రోజుకు కేవలం రూ.10 లక్షలు మాత్రమే ఆదాయం వస్తుంది. అధికారులు 30 శాతం బస్సు సర్వీసులను మాత్రమే నడుపుతున్నారు. ఇంధన ఖర్చులకు కూడా డబ్బులు రావడంలేదని ఆర్టీసీ అధికారులు గగ్గోలు పెడుతున్నారు.
కరోనా కట్టడిలో భాగంగా.. రాష్ట్ర ప్రభుత్వం నిత్యం మధ్యాహ్నం 12 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ విధించింది. బస్సులు సైతం 12 గంటల వరకే నడవడానికి అవకాశాన్ని కల్పించారు. జిల్లాలోని ఎనిమిది డిపోల పరిధిలో.. కేవలం 250 బస్సు సర్వీసులను మాత్రమే నడుపుతున్నారు. ఇంతకుముందు జిల్లా వ్యాప్తంగా 8 డిపోల పరిధిలో.. 750 బస్సు సర్వీసులను నడిపేవారు. రోజుకు సుమారు రూ.కోటి ఆదాయం వచ్చేది.