ఎన్ని అడ్డంకులు ఎదురైనా రాయలసీమ ఎత్తిపోతల పథకం నిర్మాణం పూర్తి చేయాలని కడప జిల్లా అఖిలపక్ష పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. కడప ప్రెస్ క్లబ్లో ఈ విషయమై సమావేశమైన అనంతరం మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన అక్రమ ప్రాజెక్టుల నిర్మాణంపై ఒత్తిడి తీసుకొని రావాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఈనెల 28న ఆందోళనకు అఖిలపక్ష పార్టీ నాయకులు పిలుపునిచ్చారు.
రాయలసీమ ప్రాంతం అన్ని విధాలా వెనుకంజలో ఉందని నేతలు తెలిపారు. మిగులు జలాలపై ఆధారపడి ఉన్నామని పేర్కొన్నారు. శ్రీశైలం కనీస నీటిమట్టం 854 అడుగులు అమలు చేయాల్సి ఉండగా తెలంగాణ ప్రభుత్వం విద్యుత్ అవసరాలపేరిట తోడేస్తోందని ఆరోపించారు. తెలంగాణ ప్రభుత్వం అక్రమ ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టటమే కాకుండా రాయలసీమ ప్రాజెక్టులను అడ్డుకోవడం దారుణమనన్నారు. రాయలసీమ ప్రజలకు నీటి కష్టాలు తీర్చాలన్న ఉద్దేశంతో తలపెట్టిన రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని అడ్డుకోవాలని చూస్తే సహించేది లేదని హెచ్చరించారు.