కడపలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు స్మగ్లర్లు మృతి - కడప రోడ్డు ప్రమాదంపై వార్తలు
05:50 November 02
కడపలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు స్మగ్లర్లు మృతి
కడప శివారులోని విమానాశ్రయం సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఐదుగురు ఎర్రచందనం స్మగ్లర్లు మృతి చెందారు. తమిళనాడుకు చెందిన స్మగ్లర్లు పోలీసుల కళ్లుగప్పి అక్రమ మార్గంలో ఎర్రచందనం తరలిస్తుండగా ప్రమాదం జరిగింది. కడప శివారు గోటూరు వద్ద స్మగ్లర్లకు చెందిన రెండు కార్లు టిప్పర్‌ను ఢీకొన్నాయి. తెల్లవారుజామున 3 నుంచి 4 గంటల మధ్య టిప్పర్ రోడ్డు మలుపు తిరుగుతుండగా ప్రమాదం జరిగింది. మొదటి కారు ఢీకొన్న క్షణాల్లోనే.. వెనుక వస్తున్న స్కార్పియో వాహనం టిప్పర్ డీజిల్ ట్యాంక్‌ని ఢీకొట్టింది. నలుగురు స్మగ్లర్లు అక్కడికక్కడే సజీవదహనమయ్యారు. ఒకరు రిమ్స్ లో చికిత్స పొందుతూ మృతి చెందారు.
మంటలు చెలరేగి ఎర్రచందనం ఉన్న రెండో కారులో (స్కార్పియో)నలుగురు సజీవ దహనమయ్యారు. మొదటి కారులో ఉన్న నలుగురిలో ఇద్దరు గాయపడగా వారిని రిమ్స్ కు తరలించారు. స్మగ్లర్లు కడప వైపు నుంచి తాడిపత్రి వైపు వెళ్తుండగా ప్రమాదం జరిగింది. ఘటనాస్థలికి చేరుకుని అగ్నిమాపక సిబ్బంది మంటలార్పారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలు గుర్తు పట్టలేని విధంగా మారడంతో... వారి వివరాలను తెలుసు కునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. వారంతా తమిళనాడు వాసులుగా పోలీసులు భావిస్తున్నారు.
ఇదీ చదవండి: పోలవరంపై నేడు హైదరాబాద్‌లో కీలక భేటీ