ఆంధ్రప్రదేశ్

andhra pradesh

పేరుకు మహానగరం.. సౌకర్యాలు శూన్యం

By

Published : Mar 5, 2021, 11:53 AM IST

పేరుకు విశాఖ మహానగర పాలక సంస్థ అయినప్పటికీ సౌకర్యాలు మాత్రం శూన్యమే.. ఒక వైపు సముద్రం.. మరోవైపు పచ్చటి చెట్లు.. వాటి మధ్యనే కొండ ప్రాంతాలు. దీంతో నగరంలో 25 శాతం మంది కొండ ప్రాంతాల్లో నివసిస్తున్నారు. వీరంతా పేరుకే మహా నగరంలో నివసిస్తున్నారు.. వసతులకు మాత్రం నోచుకోవటం లేదు. నగరంలో ఉంటారు.. నీరు ఉండదు.. వీధి దీపాల ఊసే ఉండదు.. వర్షం వస్తే వీరి పరిస్థితి మరింత ఆధ్వానంగా ఉంటుంది.

grater Visakhapatnam muncipal corporation
కొండ ప్రాంతాల్లో నివాసముంటున్నవారికి సౌకర్యాల లేమి

వారు ఉండేది విశాఖ మహానగరంలో.. కానీ కనీస వసతులు కూడా ఉండవు.. మైదాన ప్రాంత వాసులతో సమానంగా పన్నులు చెల్లిస్తున్నప్పటికీ సౌకర్యాల కల్పనలో అధికారులు పక్షపాతం చూపుతున్నారు. సరైన రహదారులు ఉండవు.. తాగేందుకు నీరు ఉండదు.. ఏదైనా అత్యవసరమైతే అంబులెన్స్​ వచ్చే పరిస్థితి కూడా లేదు. ఇదీ విశాఖ నగరంలోని కొండవాలు ప్రాంతాల్లో నివసించే ప్రజల దుస్థితి. నగరంలోని మైదాన ప్రాంతాల్లో విశాలమైన రోడ్లు, చక్కటి సోలార్ లైట్లు.. ఎల్లప్పుడూ తాగునీరు అందుబాటులో ఉంటుంది. కొండవాలు ప్రాంతాల్లో మాత్రం అవి కనిపించవు.. ఇరుకు సందులు, మెట్లు లాంటి మార్గాలు, వీధి దీపాల కొరత, కొన్ని చోట్ల నీటికి ఇబ్బందులు. వర్షం వస్తే ఇక్కడ ప్రజల ఇబ్బందులు వర్ణానాతీతంగా ఉంటాయి.

అంబులెన్స్ వెళ్లేందుకు వీలు లేదు..

ప్రధానంగా కొండవాలు ప్రాంతాల్లో ఎక్కువ ప్రమాదాలు జరగే అవకాశం ఉంటుంది. ఆయా సమయాల్లో బాధితులను ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు సరైన అంబులెన్స్ వ్యవస్థ లేకపోవటం అక్కడ పరిస్థితికి అద్దం పడుతోంది. హనుమంతు వాక, పెద్ద గదిలి, చిన్న గదిలి, పెద్ద గంట్యాడ, తాడి చెట్ల పాలెం, కంచర పాలెం ప్రాంతాల్లో ఎక్కువ పేద కుటుంబాలే నివాసం ఉంటున్నాయి. వీటిల్లో ఎక్కువ శాతం ఆక్రమించుకున్నవి అయితే.. మరికొన్ని దేవస్థానం భూములు ఉండటం విశేషం. ఇక్కడి ప్రజలకు వారి గృహాలను మరమ్మతులు చేసుకునే అవకాశం కూడా లేకపోవటం.. మరింతగా సమస్యలు ఎదుర్కొంటున్నారు. తమపై కనికరించి కనీసం మరమ్మతులు చేసుకునే అవకాశం అయినా ఇవ్వాలని దేవస్థానం అధికారులను స్థానికులు కోరుతున్నారు.

నగరంలో నివసిస్తున్న వారితో సమానంగా పన్నులు..

కొండవాలు ప్రాంతం కావడంతో పాములు, విష కీటకాలతో స్థానికులు ఇబ్బంది పడుతున్నారు. కొన్ని చోట్ల వీధి దీపాలు కూడా లేకపోవటం రాత్రి సమయంలో మహిళలు ఆందోళనకు గురవుతున్నారు. నగర ప్రాంతంలో ఉండేవారు ఎలాంటి పన్నులు చెల్లిస్తున్నారో.. తాము కూడా అలాగే పన్నులు కడుతున్నామని.. అయినప్పటికీ సౌకర్యాల కల్పనలో వివక్షత చూపుతున్నారని ఆరోపిస్తున్నారు. కొండ ప్రాంతాల అభివృద్ధికి నగర పాలక సంస్థ నూతన పాలక వర్గం కట్టుబడి ఉండాలని వారు కోరుతున్నారు.

ఇవీ చూడండి...:రాష్ట్ర బంద్‌: డిపోలకే పరిమితమైన బస్సులు

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details