కడప జిల్లాలోని రైతుల ఇంట సంక్రాంతి పండగ శోభ కనిపించడంలేదు. వీరికి 2020 ఏ మాత్రం కలిసిరాలేదు. మార్చి నుంచి కొవిడ్-19 వ్యాప్తి కారణంగా పంటలకు మార్కెటింగ్ సౌకర్యం సక్రమంగా లేక అవస్థలు పడ్డారు. ఈ పరిస్థితి నుంచి మెల్లగా కోలుకుంటున్న తరుణంలో నివర్ తుపాను నిండాముంచింది. ఒక్కో రైతు పెట్టిన వేల రూపాయల పెట్టుబడి నీటిపాలైంది. పంట నష్టపోయిన వారికి డిసెంబరు నెలాఖరు నాటికి పెట్టుబడి రాయితీ అందిస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. అయితే జిల్లాలో ఇప్పటివరకు చాలామంది రైతులకు సొమ్ములు అందక ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
నివర్ తుపాను ధాటికి జిల్లాలోని రైతులకు వాటిల్లిన నష్టాలను లెక్కించే ప్రక్రియ కొన్ని చోట్ల సక్రమంగా జరగలేదు. ఇందుకు ఎర్రగుంట్ల మండలం మాలెపాడులో జరిగిన లోపాలే నిదర్శనం. గ్రామంలో భారీ వర్షాలకు మొత్తం 685 మంది రైతులు నష్టపోయినట్లు సంబంధిత వ్యవసాయాధికారి గుర్తించారు. అయితే అక్కడి సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా కేవలం 385 మంది రైతుల వివరాలను మాత్రమే ప్రభుత్వానికి పంపించారు. ఫలితంగా గ్రామంలో అర్హులైన 300 మంది అన్నదాతలకు పెట్టుబడి రాయితీ సొమ్ములు అందలేదు. ఈ నెల 6వ తేదీ వరకు బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమ కాకపోవడంతో ఆయా రైతులు స్థానిక అధికారులను నిలదీయడంతో అసలు విషయం బయటపడింది. ప్రభుత్వానికి పంపిన నివేదికలో సాంకేతిక లోపాలతో 300 మంది రైతుల వివరాలు గల్లంతయ్యాయని అధికారులు చెప్పుకొచ్చారు. ఇది బయటపడ్డాక కూడా అధికార యంత్రాంగం అప్రమత్తం కాలేదని బాధిత రైతులు చెబుతున్నారు. కష్టనష్టాల్లో ఉన్న తమ కుటుంబాలకు ప్రభుత్వం వెంటనే పెట్టుబడి రాయితీ సొమ్ములు అందించి ఆదుకోవాలని కర్షకులు కోరుతున్నారు.