Telugu writer Kethu Viswanatha Reddy: ప్రముఖ రచయిత, కవి, కడప జిల్లాకు చెందిన కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత కేతు విశ్వనాథరెడ్డి ప్రకాశం జిల్లా ఒంగోలులో మృతి చెందారు. విశ్వనాధ రెడ్డి మృతిపై సాహితీలోకం కన్నీరుమున్నీరయ్యింది. తన కుమార్తె మాధవి ఇంటికి వచ్చిన ఆయన ఈ రోజు ఉదయం మృతి చెందారు. విశ్వనాథ రెడ్డి భార్యకు అనారోగ్యం కారణంగా ఆసుపత్రి కోసం ఒంగోలు రమేష్ సంఘమిత్రలో చేర్పించారు. ప్రస్తుతం ఆమె చికిత్స పొందుతున్నారు. ఆమెతో పాటు ఒంగోలు వచ్చి, కుమార్తె ఇంటివద్ద ఉన్న విశ్వనాథ రెడ్డి ఈ రోజు ఉదయం తీవ్ర అస్వస్థతకు గురవ్వడంతో ఇదే ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఆయన మరణించారు. ఆయన మరణ వార్త పలువురని దిగ్భ్రాంతికి గురి చేసింది.
కేతు విశ్వనాథరెడ్డి ప్రస్థానం కడప జిల్లా యర్రగుంట్ల మండలం రంగశాయిపురంలో జులై 10, 1939న కేతు వెంకటరెడ్డి, నాగమ్మ దంపతులకు జన్మించారు. జి.యన్.రెడ్డి పర్యవేక్షణలో కడప జిల్లా ఊర్ల పేరుపై కేతు పరిశోధన చేశారు. 1976లో ప్రచురితమైన ఈ గ్రంథంలో తొమ్మిది అధ్యాయాలున్నాయి. గ్రామ నామ పరిశీలనలో ప్రారంభమై సంజ్ఞా నామతత్త్వాన్ని, స్థల నామ పరిశోధన ప్రయోజనాన్ని వివరించింది. అందులోని చారిత్రక పరిణామాన్ని వివరించారు. బి.ఆర్. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో ఆచార్యులు, శాఖాధ్యక్షులుగా పదవీ విరమణ చేశారు.
కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు: కేతు విశ్వనాథరెడ్డి రచనలకు తెలుగు విశ్వవిద్యాలయం (1993), కేంద్ర సాహిత్య అకాడమీ (1986) అవార్డులు లభించాయి. సాహిత్య పరిశోధనకు, సాహిత్యవిమర్శకు సామాజిక శాస్త్రాల సహాయం అనివార్యమని మార్క్సిస్టులు భావిస్తారు. కేతు విశ్వనాథరెడ్డి దృష్టి అనే విమర్శ గ్రంథంలో ఈ సిద్ధాంతాన్నే ప్రతిపాదించి ఈ సిద్ధాంతం ప్రకారమే విమర్శ రాశారు.