కడప జిల్లాలో మూడు వేర్వేరు ప్రాంతాల్లో పోలీసులు నిర్వహించిన దాడుల్లో 13 మంది ఎర్రచందనం స్మగ్లర్లను అరెస్టు చేసి వారి నుంచి 22 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా పోలీస్ అధికారి అన్బు రాజన్ పేర్కొన్నారు. అరెస్టయిన స్మగ్లర్లను పోలీస్ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఎస్పీ మీడియా ఎదుట హాజరుపరిచారు. కడప జిల్లా బ్రహ్మంగారిమఠం పోలీస్ స్టేషన్ పరిధిలో రాణిబావి వద్ద స్మగ్లర్లు ఎర్రచందనం దుంగలను అక్రమ రవాణా చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం రావడంతో పోలీసులు వారిపై దాడులు చేసి ఐదుగురు స్మగ్లర్లను అరెస్టు చేశారు. వారి నుంచి పది ఎర్ర చందనం దుంగలను స్వాధీనం పరుచుకొని, ఒక బొలెరో వాహనాన్ని, ఒక ద్విచక్ర వాహనాన్ని జప్తు చేశారు. అలానే కలసపాడు పోలీస్ స్టేషన్ పరిధిలో ఎర్రచందనం అక్రమ రవాణా చేస్తున్న ఆరుగురిపై దాడులు చేసి వారి నుంచి 8 ఎర్రచందనం దుంగలను స్వాధీన పరుచుకున్నారు. బి.కోడూరు పోలీస్ స్టేషన్ పరిధిలో ఎర్రచందనం దుంగలను అక్రమ రవాణా చేస్తున్న ఇరువురు స్మగ్లర్లు అరెస్టు చేసి వారి నుంచి నాలుగు దుంగలను స్వాధీనం చేసుకున్నారు. ఎర్రచందనం స్మగ్లర్లపై గట్టి నిఘా ఉంచామని ఎస్పీ పేర్కొన్నారు.
red sandle: ఎర్ర చందనం స్మగ్లర్లు అరెస్ట్.. 22దుంగలు స్వాధీనం
రవాణా చేసేందుకు సిద్ధంగా ఉంచిన ఎర్రచందనం దుంగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 13 మంది స్మగ్లర్లను అదుపులోకి తీసుకున్నారు.
red sandle