Red Sandalwood And Ganja Smugglers : ఎర్రచందనం అక్రమ రవాణాకు, గంజాయి అక్రమ రవాణాకు వైయస్సార్ జిల్లా పోలీసులు ఎన్ని కట్టుదిట్టమైన చర్యలు చేపట్టినప్పటికీ యథేచ్ఛగా అక్రమ రవాణా అవుతూనే ఉన్నాయి. పోలీసులు ఎక్కడికక్కడ తనిఖీలు చేపట్టినప్పటికీ వివిధ మార్గాలలో ఎర్రచందనం అక్రమంగా జిల్లా సరి హద్దులు దాటిస్తున్నారు. అలానే గంజాయిని అక్రమ మార్గంలో దిగుమతి చేసుకుంటూ సొమ్ము గడిస్తున్నారు.
మీడియా ఎదుట స్మగ్లర్లు : వైయస్సార్ జిల్లా పోలీసులు ఐదుగురు ఎర్రచందనం స్మగ్లర్లను అరెస్టు చేసి వారి నుంచి 23 ఎర్రచందనం దుంగలను స్వాధీన పరుచుకున్నారు. అలానే ఏడుగురు అంతర్ జిల్లా గంజాయి స్మగ్లర్లను అరెస్టు చేసి వారి నుంచి 22 కేజీల గంజాయిని స్వాధీన పరుచుకున్నారు. అరెస్టు అయిన వారిని జిల్లా ఎస్పీ అన్బురాజన్ కడప పోలీస్ కార్యాలయంలో మీడియా ఎదుట హాజరు పరిచారు.
22 కేజీల గంజాయి స్వాధీనం : ప్రకాశం జిల్లా గిద్దలూరుకు చెందిన తులసి అనే వ్యక్తి అనకాపల్లి నుంచి గంజాయిని అక్రమ మార్గంలో రవాణా చేస్తూ జిల్లాలకు చేరవేస్తున్నారు. అందులో భాగంగా ప్రొద్దుటూరు రెండో పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి విక్రయాలు ఎక్కువగా ఉన్నాయని సమాచారం రావడంతో పోలీసులు నిఘా ఉంచి గంజాయి దిగుమతి చేస్తున్న తులసితో పాటు మరో ఏడుగురిని అరెస్టు చేశారు. వారి నుంచి 22 కేజీల గంజాయి, ఏడు సెల్ ఫోన్ లను స్వాధీన పరుచుకున్నారు. జిల్లాలో ఎక్కడైనా గంజాయి విక్రయాలు ఉంటే తమ దృష్టికి తీసుకొని రావాలని ఎస్పీ అన్బురాజన్ సూచించారు.