ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సీమలో పూర్తి ఆధిపత్యం ప్రదర్శించిన వైకాపా - రాయలసీమ మున్సిపల్ ఎలక్షన్ ఫలితాలు

రాయలసీమలోనూ అధికార పార్టీ పూర్తి స్థాయి ఆధిపత్యం ప్రదర్శించింది. తాడిపత్రి, మైదుకూరు మినహా..మిగతా అన్ని మున్సిపాలిటీలు, నగర పంచాయతీలు పూర్తి మెజార్టీతో సొంతం చేసుకుంది. తాడిపత్రి మున్సిపల్‌ ఛైర్మన్‌ ఎవరవుతారన్నది ఆసక్తికరంగా మారింది. ప్రకాశం, నెల్లూరు జిల్లాలోనూ పూర్తిగా ఫ్యాన్‌ గాలే వీచింది.

రాయలసీమలో సత్తా చాటిన వైకాపా
రాయలసీమలో సత్తా చాటిన వైకాపా

By

Published : Mar 14, 2021, 9:23 PM IST

రాయలసీమలో సత్తా చాటిన వైకాపా

సీమలోనూ వైకాపా దూకుడు ప్రదర్శించింది. సీఎం జగన్ సొంత ఇలాకా.. కడప జిల్లాలో మైదుకూరు పురపాలిక ఫలితం మాత్రం అధికార పార్టీకి ఝలక్ ఇచ్చింది. ఈ పురపాలికలో 24 వార్డులు ఉండగా 12 వార్డుల్లో తెలుగుదేశం అభ్యర్థులు గెలుపొందారు. వైకాపా 11 వార్డుల్లో విజయం సాధించింది. మరో స్థానంలో జనసేన అభ్యర్థి గెలుపొందారు. గెలుపొందిన వార్డు సభ్యులను తెలుగుదేశం, వైకాపా నేతలు రహస్య ప్రాంతానికి తరలించారు. జిల్లాలోని ప్రొద్దుటూరు, బద్వేలు, రాయచోటి పురపాలికతోపాటు.. ఎర్రగుంట్ల, జమ్మలమడుగు నగర పంచాయతీ వైకాపా హస్తగతమయ్యాయి. ఇప్పటికే పులివెందుల పురపాలిక ఏకగ్రీవమైంది.

అనంతపురం జిల్లాలో పూర్తి ఆధిపత్యం...

అనంతపురం జిల్లాలోనూ వైకాపా పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది. ముందు నుంచి అందరి దృష్టి ఆకర్షించిన తాడిపత్రి పురపాలిక ఫలితాల తర్వాత కూడా ఆసక్తి రేపుతోంది. తాడిపత్రి మున్సిపాలిటీలోని 36 వార్డుల్లో 18 వార్డులు తెలుగుదేశం సొంతమయ్యాయి. వైకాపా 16చోట్ల విజయం సాధించింది. సీపీఐ ఒక స్థానంలో, ఇతరులు ఒక స్థానంలో గెలుపొందారు. 34వ వార్డులో సమాన ఓట్లు రావడంతో టాస్‌ వేసి.. వైకాపా అభ్యర్థి గెలిచినట్లు ప్రకటించారు.

హిందూపురంలో ఫ్యాన్ హవా..

హిందూపురం మున్సిపాలిటీని వైకాపా కైవసం చేసుకుంది. 38 వార్డుల్లో వైకాపా 29, తెదేపా 6, భాజపా 1, ఎంఐఎం 1, ఇతరులు ఒకచోట గెలుపొందారు. కదిరి, రాయదుర్గం, కల్యాణదుర్గం, గుత్తి మున్సిపాలిటీల్లో వైకాపా జెండా ఎగిరింది. ధర్మవరం మున్సిపాలిటీలో అన్ని వార్డులను వైకాపా స్వీప్ చేసింది. జిల్లాలోని మడకశిర, పుట్టపర్తి నగర పంచాయతీలు అధికార పార్టీ వశం అయ్యాయి.

నాలుగు పురపాలికలు..వైకాపా సొంతం..

చిత్తూరు జిల్లాలో ఓట్ల లెక్కింపు జరిగిన నాలుగు పురపాలికలు వైకాపా సొంతమయ్యాయి. ఎన్నికలకు ముందు రెబల్‌ అభ్యర్థులపై స్థానిక ఎమ్మెల్యే రోజా వ్యాఖ్యలతో.. ఆసక్తికరంగా మారిన పుత్తూరు, నగరి మున్సిపాలిటీల్లోనూ వైకాపా విజయం సాధించింది. పుత్తూరు 25వ వార్డులో మొదట తెలుగుదేశం అభ్యర్థి స్వల్ప ఓట్లతో గెలుపొందారు. వైకాపా రీకౌంటింగ్‌కు పట్టుబట్టడంతో మళ్లీ లెక్కించారు. రీకౌంటింగ్‌లో వైకాపా అభ్యర్థి గెలుపొందినట్లు అధికారులు ప్రకటించారు. పలమనేరు, మదనపల్లెలో వైకాపా ఆధిపత్యం ప్రదర్శించింది. పలమనేరులోని 26 వార్డుల్లో... వైకాపా 24 చోట్ల గెలుపొందింది. మదనపల్లెలోని 35 వార్డుల్లో 33 సొంతం చేసుకుంది. పుంగనూరు మున్సిపాలిటీ ఇప్పటికే వైకాపాకు ఏకగ్రీవమైంది.

కర్నూలు జిల్లాలో వైకాపా జోరు....

కర్నూలు జిల్లాలో పూర్తిగా ఫ్యాన్‌ గాలి వీచింది. జిల్లాలోని నంద్యాల, ఆళ్లగడ్డ, ఆదోని, డోన్‌, నందికొట్కూరు, ఎమ్మిగనూరు, ఆత్మకూరుతో పాటు గూడూరు నగర పంచాయతీల్లో వైకాపా విజయం ఏకపక్షంగా సాగింది.

ప్రకాశం జిల్లాలో....

ప్రకాశం జిల్లాలోనూ ఫ్యాన్‌ గాలే వీచింది. చీరాల, మార్కాపురం పురపాలికలతోపాటు అద్దంకి, కనిగిరి, గిద్దలూరు, చీమకుర్తి నగర పంచాయతీల్లో వైకాపా స్పష్టమైన ఆధిక్యం చాటింది. అన్నింటిని తన ఖాతాలో వేసుకుంది. చీరాల మున్సిపాలిటీ మాత్రం తుదికంటా ఆసక్తిరేపింది. ఇక్కడ ఎమ్మెల్యే కరణం బలరాం, మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణ మోహన్‌ ఆధిపత్య పోరు స్పష్టంగా కనిపించింది. వైకాపాకు....రెబల్స్‌ దాదాపు సవాల్‌ చేశారు. చీరాలలోని 33 వార్డుల్లో 19చోట్ల వైకాపా గెలుపొందగా... ఇతరులు 13 వార్డుల్లో గెలుపొందారు. గెలిచిన 13 మంది స్వతంత్రుల్లో 10 మంది ఆమంచి వర్గీయులు ఉన్నారు.

నెల్లూరు జిల్లాలో వైకాపా విజయదుందుబి...

నెల్లూరులోని నాలుగు పురపాలికల్లో వైకాపా జెండా ఎగిరింది. నాయుడుపేటలో మొత్తం 25 వార్డుల్లో వైకాపా 23 స్థానాల్లో.. తెలుగుదేశం ఒకచోట, భాజపా ఒక స్థానంలో విజయం సాధించారు. సూళ్లూరుపేట మున్సిపాలిటీలోని 25 వార్డుల్లో వైకాపా 24 స్థానాల్లో గెలుపొందింది. వెంకటగిరి మున్సిపాలిటీలో మొత్తం 25 వార్డుల్లో 3 ఏకగ్రీవంకాగా పోలింగ్‌ జరిగిన 22 చోట్ల వైకాపా విజయం సాధించింది.

ఇదీ చదవండి:గుంటూరు నగరపాలక సంస్థ ఎన్నికల్లో ఎగిరిన వైకాపా జెండా

ABOUT THE AUTHOR

...view details