కడప జిల్లాలో రైతు భరోసా కేంద్రాలను ఘనంగా ప్రారంభించారు. వైకాపా ప్రభుత్వ ఏడాది పాలనలో ప్రజలకిచ్చిన 90 శాతం హామీలను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నెరవేర్చారని ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా ఉద్ఘాటించారు. జిల్లాలోని వల్లూరు మండల కేంద్రంలో రైతు భరోసా కేంద్రాన్ని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సీఎం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రితో పాటు కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి, కలెక్టర్ హరికిరణ్, జేడీఏ మురళీకృష్ణ పాల్గొన్నారు.
కడప జిల్లాలో రైతు భరోసా కేంద్రాలు ప్రారంభం - కడప జిల్లాలోని రైతు భరోసా కేంద్రాల తాజా వార్తలు
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన రైతు భరోసా కేంద్రాలు కడప జిల్లాలో ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ కేంద్రాల ద్వారా రైతులకు ఎంతో మేలు జరుగుతుందని నాయకులు తెలిపారు.
పులివెందులలో ఏర్పాటు చేసిన రైతు భరోసా కేంద్రాన్ని ఎంపీ అవినాష్ రెడ్డి అట్టహాసంగా ప్రారంభించారు. రైతులకు కావాల్సిన నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగు మందులను భరోసా కేంద్రాల ద్వారానే అందజేయడం జరుగుతుందని ఎంపీ తెలిపారు. ప్రభుత్వం త్వరలో జనతా బజార్లను ప్రారంభిస్తుందని చెప్పారు. వాటి ద్వారా రైతులు పండించిన పంటను ప్రభుత్వమే కొనుగోలు చేసి ప్రజలకు నాణ్యమైన ఉత్పత్తులను అందించే దిశగా కార్యాచరణ చేసిందన్నారు.
ఖాజీపేట మండలం సుంకేసులలో రైతు భరోసా కేంద్రాన్ని మైదుకూరు ఎమ్మెల్యే రఘురామిరెడ్డి ప్రారంభించారు. అనంతరం మండలంలో సేవలందిస్తున్న వాలంటీర్లకు సచివాలయ సిబ్బందికి నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. రైల్వేకోడూరు నియోజకవర్గంలో భరోసా కేంద్రాలను స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ కొరముట్ల శ్రీనివాసులు ప్రారంభించారు. భూసార పరీక్షలు, వ్యవసాయానికి అవసరమైన సలహాలు, సూచనలతో పాటు పంటకు గిట్టుబాటు ధరల లభించేలా ఈ కేంద్రాలు ఉపయోగపడతాయని ఎమ్మెల్యే తెలిపారు.