మైలవరం జలాశయం నుంచి 10 గేట్ల ద్వారా 50 వేల క్యూసెక్కుల నీటిని పెన్నా నదికి వదిలారు. లోతట్టు ప్రాంతాలైన వేపరాల, దొమ్మర, నంద్యాల, జమ్మలమడుగు, గొరిగనూరు, దేవగుడి, ప్రొద్దుటూరు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు.
కుండపోతగా కురుస్తున్న వర్షాలతో కడప జిల్లా మైదుకూరు ప్రాంతంలో వాగులు, వంకలు పోటెత్తుతున్నాయి. ఎర్ర చెరువు వంకతోపాటు.. అనకుంట వంకకు పెద్ద ఎత్తున నీరు చేరడంతో పట్టణంలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ప్రధాన రహదారితోపాటు వీధుల్లోకి నీరు చేరింది. మోకాలి లోతు నీటి మధ్యనే రాకపోకలు చేయాల్సి వస్తోంది. కొన్నిచోట్ల ఇళ్లలోకి నీరు ప్రవేశించడంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. పట్టణంలోని వంకలు ఆక్రమణకు గురయ్యాయి. అందువల్ల నీరంతా రోడ్లపైకి వచ్చి చేరుతోంది.
పులివెందుల నియోజకవర్గంలో గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు వంకలు, వాగులు, చెరువులు, పొంగి పొర్లుతున్నాయి. లింగాల మండలం పార్నపల్లి గ్రామంలో వాగులో చిక్కుకున్న ఒక వృద్ధురాలిని పోలీసులు కాపాడారు. నియోజకవర్గంలోని తొండూరు, లింగాల, సింహాద్రిపురం, వేముల, పులివెందుల మండలాల్లో పలు కాలనీలు జలమయమయ్యాయి. తొండూరు మండలంలోని మల్లెల గ్రామంలో చెరువు పొంగి ప్రవహిస్తోంది. ముద్దనూరు - పులివెందుల మార్గంలోని మల్లెల చెరువు వద్ద వంకలు ఉద్ధృతి ఎక్కువ కావడంతో.. వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. మాచవరం, బిదినంచెర్ల, పైడిపాలెం తదితర గ్రామాల్లో ఆనకట్టలు పొంగి ప్రవహిస్తున్నాయి. తొండూరు మండలం ఇనగలూరు వద్ద మగమూరు వాగు ప్రవహిస్తోంది. గ్రామంలో వర్షపు నీరు ఇళ్లలోకి చేరడంతో గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.