కడప జిల్లాలో రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు నదులు, వాగులు పొంగిపొర్లుతున్నాయి. పట్టణాల్లోని పల్లపు ప్రాంతాల్లో వర్షపు నీరు ముంచెత్తింది. రాయచోటి సుండుపల్లి వీరబల్లి సంబేపల్లి రెడ్డిపల్లి రామాపురం మండల పరిధిలో భారీ వర్షం కురిసింది. రాజంపేట, ఒంటిమిట్ట, కడప, కమలాపురం, ప్రొద్దుటూరు ప్రాంతాల్లోనూ వర్షాలు కురిశాయి. రాయచోటి, వీరబల్లి మండలాల్లో విస్తరించిన మాండవ్య నది వర్షపు నీటితో పరవళ్ళు తొక్కుతోంది. చింతపల్లి మండలంలోని బహుదా నది, పించా నదులు ఉరకలెత్తుతున్నాయి. కడప, ఒంటిమిట్ట ప్రాంతాల్లో పెన్నానదిలో వరద హోరు కొనసాగుతోంది.
కడప పట్టణంలో రాత్రి కురిసిన భారీ వర్షానికి రోడ్లన్నీ జలమయమయ్యాయి. మోకాళ్ళ లోతు వరకు వర్షపు నీరు నిలిచింది. మురుగు కాలువలు పొంగి ప్రవహించాయి. కడప ఆర్టీసీ గ్యారేజ్ లోకి వర్షం నీరు రావడంతో కార్మికులు అవస్థలు పడ్డారు. జిల్లా కోర్టు రోడ్డు, అంబేద్కర్ కూడలి, ఆర్టీసీ బస్టాండ్ రోడ్డు, వై జంక్షన్ కూడలి తదితర ప్రాంతాలన్నీ నీటమునిగాయి. మారుతి నగర్ రోడ్ అంతా వర్షపు నీటితో నిండిపోయింది. వాహన చోదకులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
కృష్ణా జిల్లాలో...
గన్నవరం పరిసర ప్రాంతాల్లో కుండపోత వర్షం కురిసింది. ఉరుములు మెరుపులు, ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం పడింది.