ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నివర్ ప్రభావం.. కడప జిల్లాలో నీట మునిగిన పంటలు

నివర్​ తుపాన్​ ప్రభావం కడప జిల్లాపై తీవ్ర ప్రభావం చూపింది. బలమైన ఈదురు గాలులతో పాటు భారీ వర్షాలు కురవడంతో ప్రాజెక్టులు నిండిపోయి ప్రమాదకర స్థితికి చేరుకున్నాయి. వాగులు, వంకలు పొంగిపొర్లగా.. పింఛా ప్రాజెక్టు కట్ట తెగింది. బుగ్గవంక పొంగడంతో ఇళ్లలోకి నీరు చేరాయి. జిల్లాలో పంటలన్నీ నీటిలో మునగగా.. నదులన్నీ ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. వాననీరు రహదారులపై నిలిచిపోవడంతో రాకపోకలు స్తంభించిపోయాయి.

rain in kadapa district due to nivar cyclone
కడప జిల్లాలో నివర్ తుఫాన్

By

Published : Nov 27, 2020, 7:55 PM IST

కడప జిల్లాలో నివర్ తుఫాన్

కడపలో..

నివర్ తుపాన్ ప్రభావం కడప నగరంపై చూపింది. రెండు రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయి. బుగ్గవంక ప్రాజెక్టు పూర్తి సామర్థ్యంతో నిండడంతో అధికారులు 4 గేట్లు ఎత్తేశారు. పరిసర ప్రాంతాల్లో ఉన్న నివాసాల్లోకి భారీగా వర్షపు నీరు చేరడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఒక్కసారిగా వరద నీరు రావడంతో .. సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లారు. నీటి ప్రవాహానికి ఇళ్లలోని సామాగ్రి మొత్తం తడిచిపోయాయి. భారీగా ఆస్తి నష్టం వాటిల్లింది. అధికారులు సహాయం చేయాలని ప్రజలు కోరుతున్నారు.

వేంపల్లిలో..

వేంపల్లి, చక్రాయపేట మండలాల్లో నివర్ తుపాన్ కారణంగా పాపాగ్ని నదికి భారీగా వరద ఉద్ధృతి పెరిగింది. గత 20 సంవత్సరాలుగా ఎన్నడు లేని విధంగా పాపగ్ని నదికి వరద వచ్చి చేరుతోంది. నది చుట్టూ వేసిన వరి పంటలు వరద ప్రవహానికి కొట్టుకుపోయాయి. గండి క్షేత్రం వద్ద కొండ చరియలు విరిగిపడటంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. పలుచోట్ల రోడ్లపై చెట్లు విరిగి విద్యుత్ తీగలపై పడటంతో పలు గ్రామాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. రోడ్డుపై అరబోసిన ధాన్యం తడిసి ముద్దైంది. ఇడుపులపాయ, రామిరెడ్డి పల్లె ముత్తుకూరు, కత్తులూరూ, గ్రామాల్లో ఇళ్లల్లోకి వర్షపు నీరు వెళ్లింది. వెలిగళ్లు ప్రాజెక్టు గేట్లు అధికారులు ఎత్తుతుండటంతో పాపాగ్ని నదికి మరింత వరద చేరే అవకాశం ఉంది. చక్రాయపేట తహసీల్దార్ సత్యానందం అధికారులను గ్రామ రెవెన్యూ అధికారులను అప్రమత్తం చేసి గ్రామాల్లో ఉండే ప్రజలను అప్రమత్తం చేశారు.

సుండుపల్లెలో...

కడపజిల్లా సుండుపల్లె మండలంలోని పింఛ ప్రాజెక్టుకు వరద నీరు పోటెత్తింది. ఎగువనుంచి భారీగా వరద నీరు రావడంతో... ప్రాజెక్టు గేట్ల పై నుంచి వరద నీరు ప్రవహిస్తోందని అధికారులు తెలిపారు. నీటి ఉద్ధృతికి పింఛ ప్రాజెక్టు కుడిగట్టు తెగిపోవడంతో జలాశయంలోని నీరంతా దిగువకు వెళ్లిపోతోంది. నాలుగు గేట్ల ద్వారా నీటిని విడుదల చేయడంతో పాటు... లక్షకు పైగా కూసెక్కుల నీరు అన్నమయ్య ప్రాజెక్టులోకి చేరుతోంది. పింఛ, అన్నమయ్య ప్రాజెక్టుల నుంచి వరద నీరు ప్రమాదకరంగాప్రవహిస్తోంది.

రాయచోటిలో...

రాయచోటి నియోజకవర్గానికి వరప్రసాదిని గా ఉన్న వెలిగల్లు ప్రాజెక్టు ఎట్టకేలకు 12 ఏళ్లకు పూర్తి స్థాయిలో నిండింది. తుపాను ప్రభావంతో ఎగువ నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరడంతో.. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరుకుంది. అధికారులు 5 గేట్లను ఎత్తి దిగువన పాపాగ్ని నదికి నీటిని విడుదల చేస్తున్నారు. 2008లో రూ 208 కోట్లతో 4.65 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యంతో నిర్మించిన ఈ ప్రాజెక్టు ఇప్పటివరకు ఒక్కసారి కూడా నిండలేదు. మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు కర్ణాటక, ఆంధ్ర రాష్ట్ర సరిహద్దు నుంచి భారీగా వరద నీరు చేరడంతో ప్రాజెక్టు నిండింది. ఈ ప్రాజెక్టు కుడి, ఎడమ కాలువల ఆధారంగా 24 వేల ఎకరాలకు సాగునీరు అందుతుందని నీటి పారుదల శాఖ అధికారులు పేర్కొంటున్నారు.

జమ్మలమడుగులో..

జమ్మలమడుగు నియోజకవర్గంలో రెండో రోజు వర్షాలు కురుస్తున్నాయి. జమ్మలమడుగు, మైలవరం, పెద్దముడియం, ముద్దనూరు తదితర మండలాల్లో కురిసిన వర్షానికి పంటలు నీటమునిగాయి. వరి, శనగ పంటలు పూర్తిగా తడిసిపోయాయి. వేలాది ఎకరాల్లో పంటలు నీట మునగడంతో భారీగా నష్టపోయామని రైతులు వాపోతున్నారు. పొద్దుటూరు, జమ్మలమడుగు మండలాల్లో వరి , శనగ పంట, జమ్మలమడుగు , పెద్దముడియం మండలంలో శనగ పంట నష్టం వాటిల్లింది.

రైల్వేకోడూరులో...

రైల్వేకోడూరు నియోజకవర్గంలో రెండు రోజులుగా విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. నియోజకవర్గ పరిధిలోని వాగులు, వంకలు, ఏర్లు పొంగిపొర్లుతున్నాయి. ఈ నీటి ఉద్ధృతి వల్ల కొన్ని చోట్ల రోడ్లు కొట్టుకుపోయాయి. రైల్వేకోడూరులోని గుంజన ఏరు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. సమీపంలో ఉన్న కొన్ని గృహాలు ప్రవహానికి దెబ్బతినగా... రహదారులు కొట్టుకపోయాయి. రైల్వే కోడూరు మండలంలో వంద ఎకరాలకు పైగా అరటి తోటలు ధ్వంసమయ్యాయి. రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల వలన చెరువు, కుంటలు నిండుకుండలా మారాయి.

పెనగలూరులో...

రాత్రి కురిసిన భారీ వర్షం వల్ల పెనగలూరు మండలం నారాయణ నెల్లూరు వద్దనున్న పుల్లంగేరు సమీపంలో చిక్కుకున్న ఐదుగురు రైతు కులీలను సురక్షితంగా వెలుపలికి తీసుకువచ్చారు. ఈ ఆపరేషన్​లో రైల్వేకోడూరు అగ్నిమాపక శాఖ అధికారులు, పెనగలూరు మండలం రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు. చిట్వేలు మండలంలో చిట్వేలికి రాచపల్లికి మధ్య ఉన్న ప్రధాన రహదారి వంతెన నీటి ఉద్ధృతికి కొట్టుకుపోవడంతో.. రాచపల్లి, హరిజనవాడ, వైఎస్ఆర్ఎస్​టీ కాలనీ గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.

ఇదీ చూడండి.

కడపలో బుగ్గవంకకు భారీగా వరదనీరు.. సహాయక చర్యల్లో ఎస్పీ..

ABOUT THE AUTHOR

...view details