కడప జిల్లా రైల్వేకోడూరు పట్టణంలో ప్రతి సంవత్సరం మే లో జరిగే గంగమ్మతల్లి జాతర.. ఈ సారి కరోనా ప్రభావంతో భక్తులు లేక వెలవెలబోతోంది. ఇక్కడ గంగమ్మ తల్లిని దర్శించుకుంటే కోరిన కోర్కెలు తీరుతాయని భక్తుల నమ్మకం. అందుకే ప్రతి ఏటా గంగమ్మ తల్లిని దర్శించుకోడానికి నియోజకవర్గ ప్రజలే కాకుండా స్థానికులే కాక.. ఇతర రాష్ట్రాల నుంచి సైతం భక్తులు లక్షల సంఖ్యలో హాజరవుతారు. గతేడాది నుంచి కరోనా వైరస్ ఉద్ధృతి వలన గంగమ్మ జాతరను నిడారంబంగా జరుపుతున్నారు.
జాతరకు ఇతరులెవరూ రైల్వేకోడూరు రాకుండా ప్రభుత్వం, పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. ఎవరికి వారు ఇళ్లల్లోనే.. సంప్రదాయం ప్రకారం గంగమ్మ తల్లి ముద్దలు పెట్టుకొని జాతర చేసుకుంటున్నారు. ఫలితంగా.. గంగమ్మ గుడి వద్ద భక్తుల సందడి లేక చిన్నబోయింది. రైల్వే కోడూరులో కరోనా ఉద్ధృతి తగ్గలేదని.. ప్రజలెవరూ గంగమ్మ తల్లి గుడి వద్దకు రాకూడదని.. ఎవరి ఇళ్లల్లో వాళ్ళు పూజలు చేసుకోవాలని గ్రామ పెద్దలు, పోలీసులు విజ్ఞప్తి చేశారు.