పరిపాలన పరంగా ప్రభుత్వం అనుమతిస్తే హైదరాబాద్‌లోని పీఆర్కే ఆసుపత్రి ఆధ్వర్యంలో మైదుకూరులో కొవిడ్ ఉచిత చికిత్స కేంద్రం ఏర్పాటు చేస్తానని తితిదే పాలక మండలి మాజీ చైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్ తెలిపారు. నియోజకవర్గంలోని కొవిడ్ బాధితులకు సేవలు అందించే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకోగా అధికారులు అనుమతి ఇవ్వలేదని పేర్కొన్నారు. బుధవారం చరవాణి ద్వారా విలేకర్లతో మాట్లాడుతూ నియోజకవర్గంలోని కరోనా బాధితులు దాదాపు 50 మంది.. పీఆర్కే ఆసుపత్రి నుంచి సేవలు పొందారని తెలిపారు.
నియోజకవర్గం నుంచి హైదరాబాద్‌కు వెళ్లడం కష్టమైన నేపథ్యంలో పార్టీలకు అతీతంగా తనవంతు సేవలు అందించేందుకు మైదుకూరులోనే చికిత్స అందించాలని నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేశారు. ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్‌తో ఫోన్ ద్వారా చర్చించానని పేర్కొన్నారు. డబ్బు చెల్లిస్తామన్నా ఆక్సిజన్ సరఫరా చేయలేమని, ప్రైవేట్ చికిత్స కేంద్రం ఏర్పాటుకు అనుమతి ఉండదని జిల్లా కలెక్టర్ స్పష్టం చేసినట్లుగా వివరించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి సమాచారం పంపినా స్పందనలేదన్నారు.
కోవిడ్ చికిత్స కేంద్రం ఏర్పాటు చేస్తే నియోజకవర్గంలో తనకు ఎక్కడ మంచి పేరు వస్తుందోనని అనుమతి నిరాకరిస్తున్నారని సుధాకర్ యాదవ్ ఆరోపించారు. తనకు అనుమతి ఇవ్వక పోయినా.. ప్రభుత్వమైనా మైదుకూరు నియోజకవర్గ కేంద్రంలో కొవిడ్ చికిత్స కేంద్రం ఏర్పాటు చేసి కరోనా బాధితుల ప్రాణాలు కాపాడాలని కోరారు.