Pushpagiri kabza: ఇసుక మాఫియా నదులను తోడేస్తుండగా.. మట్టి మాఫియా కొండలను పిండి చేస్తోంది. అధికారులు అడ్డుకోకపోవడంతో మరింతగా చెలరేగుతోంది. చివరికి పవిత్ర స్థలాలను సైతం మట్టి మాఫియా వదిలిపెట్టడం లేదు. భక్తులు పరమ పవిత్రంగా భావించే పుణ్యక్షేత్రాలకు చెందిన గుట్టలను సైతం తోడేస్తున్నారు. ఈ క్రమంలో పరమ పవిత్రమైన పుష్పగిరి పర్వతంపై మట్టి మాఫియా కన్నేసింది. గిరిని ఆక్రమించడంతో పాటు పెన్నా నది ఇసుకతిన్నెలను భారీ యంత్రాల ద్వారా అక్రమ మైనింగ్ మాఫియా చేస్తూ ఇక్కడి పుణ్యక్షేత్ర పవిత్రతకు భంగం కలిగిస్తోంది. సంప్రదాయాలు పట్టించుకోకుండా, భక్తుల మనోభావాలకు విఘాతం కలిగిస్తోంది. భక్తులు అటువైపు రాకుండా అడ్డుకుంటూ భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వైయస్సార్ కడప జిల్లా వల్లూరు మండలం పుష్పగిరి ఆలయం కొండలను పరిరక్షించాలంటూ ఓ న్యాయవాది అధికారులకు ఫిర్యాదు చేయగా.. జేసీ తక్షణమే స్పందించారు. పూర్తిస్థాయి నివేదిక ఇవ్వాల్సిందిగా దేవాదాయ శాఖ అధికారులను అదేశించారు.
Pushpagiri kabza: పుష్పగిరిని పిండేస్తున్న మట్టి మాఫియా.. విచారణకు జేసీ ఆదేశం - Pushpagiri Mud mafia
Pushpagiri kabza: పుష్పగిరి కొండకు మట్టి మాఫియా నుంచి ప్రమాదం పొంచి ఉంది. గిరి ప్రదక్షిణ చేయకుండా భక్తులను భయభ్రాంతులకు గురి చేస్తున్న ఆక్రమణదారులు.. కొండను పిండి చేసేందుకు యత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఓ న్యాయవాది ఫిర్యాదు మేరకు అధికార యంత్రాంగంలో కదలిక వచ్చింది. తక్షణ చర్యలకు జాయింట్ కలెక్టర్ ఆదేశించారు.
వైయస్సార్ కడప జిల్లా వల్లూరు మండలం పుష్పగిరి ఆలయం గిరి ప్రదర్శనకు సంబంధించి చుట్టుపక్కల ప్రాంతాల్లో ఆక్రమణ గురైన కొండలను సంరక్షించాలని జాయింట్ కలెక్టర్ గణేశ్‌కుమార్ దేవాదాయ శాఖ అధికారులకు సూచించారు. సంబంధిత ఆక్రమణదారులపై చర్యలు తీసుకోవాలని జేసీ ఆదేశించారు. గిరి ప్రదక్షణ భక్తులను అడ్డగించే వారిపై ఏపీ దేవాదాయ ధర్మాదాయ శాఖ చట్టం-1987/30 ప్రకారం చర్యలు తీసుకోవాలని జిల్లా దేవాదాయ శాఖ అధికారి శంకర్ బాలాజీనీ జేసీ ఆదేశించారు. మరోవైపు పుష్పగిరిని ఆక్రమించి తప్పుడు పత్రాలు, పట్టాపాస్ పుస్తకాలు సృష్టించిన ఆక్రమణదారులపై చట్టపరమైన చర్యలకు అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు. పూర్తి స్థాయి నివేదికను కలెక్టర్ కార్యాలయానికి తక్షణమే సమర్పించాలని జేసీ ఆదేశించారు.
పుష్పగిరి పీఠాధిపతి శ్రీశ్రీ అభినవ ఉద్ధండ విద్యాశంకర భారతి మహాస్వామి గత ఆరు నెలల కిందట ప్రారంభించిన పుష్పగిరి గిరి ప్రదక్షణ మహా యజ్ఞం అవిఘ్నంగా ప్రతినెలా పౌర్ణమి రోజున కొనసాగుతోంది. ఈ సందర్భంగా పుష్పగిరి గిరి ప్రదక్షిణ మహా యజ్ఞం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. శ్రీశైలం, ఇంద్రకీలాద్రి, యాదగిరిగుట్ట, సింహాచలం సహా పలు పుణ్యక్షేత్రాల్లోనూ గిరిప్రదక్షిణను అక్కడి ఆలయ అధికారులు, ప్రజా ప్రతినిధులు ప్రారంభించారు. కాగా, పరమ పవిత్రమైన పుష్పగిరి పర్వతాన్ని, పెన్నా నది ఇసుకతిన్నెలను భారీ యంత్రాల ద్వారా అక్రమ మైనింగ్ మాఫియా చేస్తూ ఇక్కడి పుణ్యక్షేత్ర పవిత్రతకు భంగం కలిగిస్తున్నారు. సంప్రదాయాలు పట్టించుకోకుండా, భక్తుల మనోభావాలకు విఘాతం కలిగిస్తున్నటువంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని న్యాయవాది భారవి సోమవారం కలెక్టర్ కార్యాలయంలో వినతి పత్రం సమర్పించారు. తక్షణమే స్పందించిన జేసీ పూర్తి నివేదికను తనకు సమర్పించాలని వైఎస్ఆర్ జిల్లా దేవాలయ శాఖ అధికారి శంకర బాలాజీని ఆదేశించారు.