Proddatur girls excelling in Kuchipudi: ప్రొద్దుటూరు వైఎమ్ఆర్ కాలనీలోని నృత్య తరంగిణి కళానిలయంలో వందమందికిపైగా బాలికలు కూచిపూడి, జానపద నృత్యాలు నేర్చుకుంటున్నారు. పట్టణంతోపాటు ఇతరప్రాంతాల బాలికలు.. శిక్షకుడు శ్రావణ్‌కుమార్ వద్ద తర్ఫీదు పొందుతున్నారు. తల్లిదండ్రులు ప్రోత్సాహంతో చదువుకుంటూనే.. ఖాళీ సమయాల్లో కూచిపూడి, జానపద నృత్య సాధన చేస్తున్నారు. ఇక్కడ శిక్షణ పొందుతున్న చిన్నారులు తమ ప్రదర్శనలతో.. జిల్లా స్థాయినుంచి జాతీయ స్థాయి వరకు పురస్కారాల పంట పండిస్తున్నారు.
గత నెలలో పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో కళానిలయం సంస్థ 38వ జాతీయ స్థాయి నృత్య పోటీలు నిర్వహించగా.. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి 700 మందికి పైగా ప్రదర్శనలు ఇచ్చారు. ఈ పోటీల్లో ప్రొద్దుటూరు నృత్య తరంగిణిలో శిక్షణ పొందిన బాలికలు సత్తా చాటారు. కూచిపూడి, జానపదం విభాగాల్లో జాతీయ స్థాయిలో అవార్డులు సాధించి ప్రశంసలు అందుకున్నారు. తల్లిదండ్రులు, గురువు ప్రోత్సాహంతోనే తాము అవార్డులు సాధించినట్లు బాలికలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
చిన్నవయసులోనే అనేక వేదికలపై కూడిపూడి, జానపద నృత్య ప్రదర్శనలు చేస్తూ తమ పిల్లలు బహుమతులు దక్కించుకోవడంపై వారి తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పిల్లలను వారికి ఇష్టమైన రంగంలో రాణించేందుకు ప్రోత్సాహించాలని చెబుతున్నారు. సంప్రదాయ నృత్యంలో బాలికలు రాణించే విధంగా వారికి ప్రత్యేక శిక్షణ ఇస్తున్నట్లు శిక్షకుడు శ్రావణ్‌కుమార్ వివరించారు. సంప్రదాయ నృత్యంపై మక్కువతో కూచిపూడి, జానపద నృత్యాలు నేర్చుకుంటున్నామని.. నృత్య గురువు సారథ్యంలో రాబోయే రోజుల్లో మరిన్ని పురస్కారాలు సాధిస్తామని బాలికలు చెబుతున్నారు.