ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కడప ఉక్కుకు చిక్కులు? - కడప ఉక్కు పరిశ్రమ లేటేస్ట్ న్యూస్

కడపలో ఏర్పాటు చేయతలపెట్టిన భారీ ఉక్కు కర్మాగారానికి భాగస్వామిగా ఎంపికైన లిబర్టీ స్టీల్స్‌ సంస్థ ఆర్థిక సమస్యల్లో చిక్కుకుంది.కర్మాగారం కోసం తొలిదశలోనే రూ.10 వేల కోట్ల పెట్టుబడి పెట్టాల్సిన గ్రూపు ఇలా ఆర్థిక సమస్యల్లో ఉంటే ప్రాజెక్టును ఎలా ముందుకు తీసుకెళ్తుందన్న సందేహం వ్యక్తమవుతోంది.

కడప ఉక్కుకు చిక్కులు?
కడప ఉక్కుకు చిక్కులు?

By

Published : Mar 13, 2021, 5:16 AM IST

రాష్ట్ర ప్రభుత్వం కడపలో ఏర్పాటు చేయతలపెట్టిన భారీ ఉక్కు కర్మాగారానికి భాగస్వామిగా ఎంపికైన లిబర్టీ స్టీల్స్‌ సంస్థ ఆర్థిక సమస్యల్లో కూరుకుపోయింది. ఇది పారిశ్రామిక వర్గాల్లో చర్చనీయాంశమవుతోంది. కడప కర్మాగారం కోసం తొలిదశలోనే రూ.10 వేల కోట్ల పెట్టుబడి పెట్టాల్సిన గ్రూపు ఇలా ఆర్థిక సమస్యల్లో ఉంటే ప్రాజెక్టును ఎలా ముందుకు తీసుకెళ్తుందన్న సందేహం వ్యక్తమవుతోంది. లిబర్టీ గ్రూపు బ్రిటన్‌ కేంద్రంగా పనిచేస్తోంది. లిబర్టీ స్టీల్స్‌ యాజమాన్య సంస్థ అయిన ‘గుప్తా ఫ్యామిలీ గ్రూప్‌ (జీఎఫ్‌జీ) అలయెన్స్‌’కు ప్రధాన రుణదాత అయిన ‘గ్రీన్‌సిల్‌ కేపిటల్‌’ బ్రిటన్‌లో ఈ నెల 8న దివాలా పిటిషన్‌ దాఖలు చేయడంతో లిబర్టీ వ్యవహారాలపై చర్చ మొదలైంది. జాతీయ, అంతర్జాతీయ మీడియాలో దీనిపై వరుస కథనాలు వస్తున్నాయి. తాను ఎక్కువగా రుణాలిచ్చిన జీఎఫ్‌జీ గ్రూపు నుంచి వాయిదాల వసూళ్లు ఆగిపోయాయని, ఆ గ్రూపు ఆర్థికంగా తీవ్ర కష్టాల్లో ఉందని ‘గ్రీన్‌సిల్‌’ తన దివాలా పిటిషన్‌లో పేర్కొన్నట్లు ‘రాయిటర్స్‌’ పేర్కొంది. గ్రీన్‌సిల్‌ నుంచి తనకు నిధులు ఆగిపోతే తాను దివాలా తీసే పరిస్థితి ఉందని జీఎఫ్‌జీ ఫిబ్రవరిలో తెలిపినట్లు కూడా ఆ పిటిషన్‌లో ఉందని, జీఎఫ్‌జీ గ్రూపు గ్రీన్‌సిల్‌కు దాదాపు 4.15 బిలియన్‌ డాలర్ల (రూ.30,187 కోట్లు) బకాయి ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.

ఈ పరిణామాలతో లిబర్టీ గ్రూపు ఉక్కు కర్మాగారాలున్న బ్రిటన్‌, ఫ్రాన్స్‌, ఆస్ట్రేలియా లాంటి దేశాలు అప్రమత్తమయ్యాయి. బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ కార్యాలయం లిబర్టీ స్టీల్స్‌తో నిరంతరం చర్చిస్తోంది. గ్రీన్‌సిల్‌ సంస్థ ఆర్థిక ఇబ్బందులు జీఎఫ్‌జీ కర్మాగారాలను, కార్మికులను సమస్యల్లోకి నెడితే వారికి తాము సాయం చేస్తామని ఫ్రాన్స్‌ మంత్రి బ్రూనో లీ మెయిరే ప్రకటించారు. ఆస్ట్రేలియాలోనూ జీఎఫ్‌జీ గ్రూపునకు ఒక ఉక్కు కర్మాగారం ఉంది. తాజా పరిణామాలను పూర్తిస్థాయిలో పరిశీలిస్తున్నామని ఆ దేశ పరిశ్రమల మంత్రిత్వశాఖ పేర్కొంది. గ్రీన్‌సిల్‌ కష్టాలు తమకు సంక్షిష్ట పరిస్థితిని సృష్టించినా.. ప్రస్తుత అవసరాలకు తగిన నిధులు తమవద్ద ఉన్నాయని జీఎఫ్‌జీ ఒక ప్రకటనలో పేర్కొంది. రుణాల కోసం ప్రత్యామ్నాయ మార్గాలు చూస్తున్నామని, ఇందుకు కొంత సమయం పడుతుందని ఆ ప్రకటనలో గ్రూపు పేర్కొంది.

ఆంధ్రప్రదేశ్‌ కింకర్తవ్యం?
కడపలో 30 లక్షల టన్నుల వార్షిక ఉత్పత్తి సామర్థ్యంతో ఉక్కు కర్మాగారం తొలిదశ నిర్మాణాన్ని మూడేళ్లలో పూర్తి చేయనున్నట్లు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ప్రకటించారు. దీనివల్ల ప్రత్యక్షంగా, పరోక్షంగా 25వేల ఉద్యోగాలు వస్తాయని తెలిపారు. ప్రభుత్వం తరఫున ఇందుకోసం ఏపీ హైగ్రేడ్‌ స్టీల్‌ కార్పొరేషన్‌ను ఏర్పాటుచేశారు. దీనికి 3,275 ఎకరాల భూమిని కేటాయించారు. కర్మాగారానికి ఇనుప ఖనిజం సరఫరాకు కేంద్రప్రభుత్వ సంస్థ ఎన్‌ఎండీసీతో ఒప్పందం కుదుర్చుకున్నారు. ప్రైవేటు భాగస్వామి ఎంపికకు ముందే 2019 డిసెంబరు 23న కర్మాగారం నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. కడప ఉక్కు సంయుక్త భాగస్వామి సంస్థగా లిబర్టీ స్టీల్‌ ఇండియా ఎంపికను ఆమోదిస్తూ గతనెల 23న జరిగిన మంత్రివర్గ సమావేశం తీర్మానించింది. తమకు వచ్చిన ప్రతిపాదనల్లో ఎస్‌బీఐ క్యాప్‌ సిఫారసు మేరకు లిబర్టీ సంస్థను ఎంపిక చేసినట్లు ప్రకటించింది. కర్మాగార నిర్మాణానికి తొలిదశలో రూ.10,082 కోట్లు, రెండోదశలో రూ.6వేల కోట్లు ఖర్చు కానున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. పోటీలో ఉన్న ఇతర సంస్థలు, వాటితో పోలిస్తే లిబర్టీకి ఉన్న సానుకూలతలు ఏంటన్నది ప్రభుత్వం వెల్లడించలేదు. లిబర్టీ గ్రూపు వివిధ దేశాల్లో నడుపుతున్న కర్మాగారాల పరిస్థితిపై అక్కడి ప్రభుత్వాలు ఆందోళన చెందుతున్న తరుణంలో కడప ఉక్కు కర్మాగారంపై లిబర్టీ గ్రూపు వేల కోట్లు ఖర్చు పెట్టగలదా అనే సందేహం వస్తోంది. ప్రభుత్వం లిబర్టీ గ్రూపుతోనే ముందుకు వెళ్తుందా లేదా ప్రత్యామ్నాయం అన్వేషిస్తుందా అనేది వేచిచూడాలి.

మన దేశంలో..
ఒడిశాలోని సుందర్‌గఢ్‌లో మూతపడ్డ ‘ఆధునిక్‌ మెటాలిక్స్‌’ అనే ఉక్కు కర్మాగారాన్ని, దాని అనుబంధ సంస్థ జియోన్‌ స్టీల్‌ను రూ.425 కోట్లకు లిబర్టీ గ్రూపు కొనుగోలు చేసింది. ఆధునిక్‌కు 5 లక్షల టన్నుల ఉత్పత్తి సామర్థ్యం ఉంది. కొద్దికాలం కిందట ఉత్పత్తిని పునరుద్ధరించారు. ఆంధ్రప్రదేశ్‌లోని నాయుడుపేట వద్ద మూతపడ్డ ఎస్‌.బి.క్యూ. స్టీల్స్‌ కర్మాగారాన్ని గత ఏడాది ఆఖరులో లిబర్టీ గ్రూపు రూ.270 కోట్లకు కొన్నా.. ఉత్పత్తిని ఇంకా ప్రారంభించలేదు. తాజాగా కడప ఉక్కు కర్మాగార నిర్మాణానికి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ సంస్థకు సంయుక్త భాగస్వామిగా ఎంపికైంది.

పరిణామాలు గమనిస్తున్నాం
మంత్రి గౌతమ్‌రెడ్డి

లిబర్టీ స్టీల్స్‌ తాజా పరిణామాలను ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నిశితంగా గమనిస్తోందని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గౌతమ్‌రెడ్డి ‘ఈనాడు’ ప్రతినిధికి తెలిపారు. ఇందుకు బ్రిటన్‌లోని భారత రాయబార కార్యాలయ సహకారం తీసుకుంటున్నామన్నారు. కడపలో ఉక్కు కర్మాగారం నిర్మాణానికి ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని, ఇందుకోసం అవసరమైతే ఇప్పటివరకూ తాము తీసుకున్న నిర్ణయాల్లో మార్పులు చేస్తామని ఆయన చెప్పారు.

లిబర్టీ గ్రూపు నేపథ్యం ఇదీ..

లిబర్టీ గ్రూపునకు దాదాపు 30 దేశాల్లో వాణిజ్య కార్యకలాపాలు ఉన్నాయి. దీని సారథి సంజీవ్‌ గుప్తా. పంజాబీ పారిశ్రామిక కుటుంబానికి చెందిన ఆయన ఉన్నతవిద్య కోసం బ్రిటన్‌ వెళ్లి అక్కడ లిబర్టీ మాతృసంస్థ ‘గుప్తా ఫ్యామిలీ గ్రూప్‌ (జీఎఫ్‌జీ) అలయెన్స్‌’ను ఏర్పాటు చేశారు. ప్రధానంగా రుణాలపై ఆధారపడి ఈ గ్రూపు యూరప్‌, ఇతర దేశాల్లో ఉక్కు కర్మాగారాలను నిర్వహిస్తోంది. అనేకచోట్ల ఖాయిలా పడ్డ కర్మాగారాలను కొంటోంది. బ్రిటన్‌, చైనాలలో టాటా గ్రూపునకు చెందిన స్పెషాలిటీ స్టీల్స్‌ వ్యాపారాన్ని 2017లో కొనుగోలు చేసింది. బ్రిటన్‌లో ఇది మూడో అతిపెద్ద ఉక్కు ఉత్పత్తిదారు. ప్రపంచవ్యాప్తంగా 2019లో ఈ గ్రూపు 50 లక్షల టన్నుల ఉక్కును ఉత్పత్తి చేసింది. ఏడాదికి 3 లక్షల టన్నుల అల్యూమినియం ఉత్పత్తి చేయగల పరిశ్రమలు ఉన్నాయి. ఈ గ్రూపు కంపెనీల్లో 35 వేల మంది ఉద్యోగులు ఉన్నారు.

ఇవీ చదవండి

కొప్పర్తిలో వేగంగా ఎలక్ట్రానిక్స్ మ్యానిఫ్యాక్చరింగ్ క్లస్టర్ పనులు

ABOUT THE AUTHOR

...view details