Prasanna Awareness on Save Trees with Paintings: ఆర్టిస్టుగా రాణించాలనే ఉద్దేశంతో.. ప్రముఖ చిత్ర కళాకారుడు తుపాకుల మహేశ్ వద్ద శిక్షణ తీసుకుంటోంది ఈ యువతి. నాలుగేళ్లుగా ఎన్నో రకాల వైవిధ్యమైన చిత్రాలను ఇండియన్ కలర్స్‌లో వేస్తూ అబ్బురపరుస్తోంది. కేవలం సందేశాత్మక వర్ణ చిత్రాలు మాత్రమే కాక.. ప్రముఖుల చిత్రాలను కూడా వేస్తూ వారికి బహుమానంగా అందిస్తోంది.
Nature Loving Young Painter Prasanna: కుంచెతో అందమైన బొమ్మలు వేస్తున్న ఈ అమ్మాయి పేరు కొడవలూరు ప్రసన్న. వై.ఎస్.ఆర్ కడప జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన రామచంద్రరాజు, మంజువాణి దంపతుల రెండో కుమార్తె. ఇంటర్మీడియట్ తర్వాత ఏడాది పాటు చెన్నైలో హిందీ పండిట్ శిక్షణ పూర్తి చేసింది. ఆ తర్వాత చదువుపై అంతగా ఆసక్తి చూపని ప్రసన్న.... తనకు చిన్నతనం నుంచి ఎంతో ఇష్టమైన డ్రాయింగ్‌పై మక్కువ పెంచుకుంది.
తండ్రి కళ్లలో ఆనందం కోసం.. సరికొత్త యంత్రాన్ని ఆవిష్కరించాడో కుమారుడు
అలా పెయింటింగ్స్ వేయడం ప్రారంభించిన ప్రసన్న.. అందరిలా ఏదో ఒక పెయింటింగ్స్‌కాకుండా పర్యావరణం అనే థీమ్‌తో తను చిత్రాలు గీయడం ప్రారంభించింది. సేవ్ ది నేచర్ (Save The Nature) అనే సందేశాన్ని ప్రముఖల ద్వారా పంపాలని నిర్ణయించుకుంది. అదే సంకల్పంతో.. వారికి ఇచ్చే పెయింటింగ్ లో "సేవ్ ట్రీస్" అనే లోగో వేసి ఇస్తోంది. ఆ లోగోను ప్రముఖ పద్మశ్రీ అవార్డు గ్రహీత కర్నాటకకు చెందిన తిమ్మక్క చేతుల మీదుగా ఆవిష్కరింపజేసింది ప్రసన్న. దీని ద్వారా ప్రముఖుల సందేశాలను, ఆటోగ్రాఫ్‌లను తీసుకుని భద్రపరుచుకుంటోంది ఈ యువతి.
ఈ నాలుగేళ్ల కాలంలో రెండు తెలుగు రాష్ట్రాల్లోని దాదాపు 100మంది ప్రముఖుల చిత్రాలను వేసింది ప్రసన్న. అందులో సినీ, రాజకీయ, న్యాయ కోవిదులు వంటి వారు ఉన్నారు. వారి చిత్రాలను అందమైన పెయింటింగ్స్‌గా వేస్తూ.. ఆ ప్రముఖులకే ఉచితంగా అందిస్తోంది. ఫలితంగా చెట్లను కాపాడాలనే సందేశాన్ని ప్రజల్లోకి పంపుతోంది ఈ యువతి.