కడప అంటే కరవుకు నెలవు. వర్షాకాలంలో సైతం గ్రామీణ గడపలో దాహం కేకలు మిన్నంటేవి. సారవంతమైన నేలలు బీడుగా దర్శనమిచ్చేవి. జల వనరులన్నీ చుక్కనీరు కరవై వెలవెలబోయేవి. ఎటు చూసినా దుర్భిక్షం తాండవించేది.. ఇది నిన్నటి మాట. ప్రస్తుతం పరిస్థితి పూర్తిగా మారిపోయింది. వాన చినుకుకు నోచుకోని నేలపై సైతం వరదలు పారాయి. వాగు, వంక, నదులు పరవళ్లు తొక్కాయి. కుంట, చెరువు, జలాశయాలన్నీ నిండుగా కళకళలాడుతున్నాయి. భూగర్భ జలాలు పైపైకి ఉబికి వస్తున్నాయి. మొన్నటి వరకు సాగు, తాగునీటికి తంటాలు పడిన ప్రజలు, కర్షకులకు కొండంత ధీమా వచ్చింది. అక్టోబరులో కురిసిన భారీ వర్షాలకు తోడు ఇటీవల నివర్ తుపాను ప్రభావంతో కురిసిన జడివాన జిల్లా పరిస్థితిని పూర్తిగా మార్చివేశాయి. కరవు సీమ రైతన్నల్లో ఆశలను చిగురింపజేశాయి.
జిల్లాలో చిన్న, పెద్ద చెరువులు 1,394 ఉన్నాయి. వీటి నీటి నిల్వ సామర్థ్యం 14.36 టీఎంసీలు. కొన్ని రోజులుగా విస్తారంగా కురుస్తున్న వర్షాలతో ఎక్కడ చూసినా జలకళ ఉట్టిపడుతోంది. తాగు, సాగునీటికి భరోసా లభించింది. ఈ ఏడాది జూన్ నుంచి నవంబరు వరకు ఆరు నెలల్లో జిల్లా సగటు సాధారణ వర్షపాతం 618.9 మి.మీ కురవాలి. ఈసారి ఖరీఫ్ ఆరంభం నుంచి వర్షాలు కురిశాయి. సాధారణం మించి వానొచ్చింది. ఆరు నెలల కాలంలో 1,046.1 మి.మీ వర్షం కురిసింది. వేలాది చెరువులు నిండాయి. వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. జిల్లా వ్యాప్తంగా చిన్ననీటి వనరుల్లో ప్రస్తుతం 13.50 టీఎంసీల జలాలు చేరాయి. చాలా ఏళ్ల తరువాత బద్వేలు పెద్దచెరువు నిండింది. ఒంటిమిట్ట మండలంలోని ఏకశిలానగరి, గంగలచెరువు, గంగపేరూరు, చింతరాజుపల్లె, చలమారెడ్డి చెరువులు నిండి అలుగులు పొంగాయి. జిల్లా వ్యాప్తంగా ఎన్నో తటాకాల్లో నీటి సవ్వడి ఆయకట్టుకు భరోసా ఇస్తోంది. ఆయా ప్రాంతాల్లో భూగర్భ నీటిమట్టాలు గణనీయంగా పెరిగాయి. జిల్లాలో జలవనరులశాఖ పర్యవేక్షణలో పంట, ఊట కుంటలు, చెక్‌డ్యాంలు, ఇతర నీటి వనరులు 1,28,572 ఉన్నాయి. వీటి నిల్వ సామర్థ్యం 4.828 టీఎంసీలు.
చెరువులు నిండాయి