Police Stopped Child Marriage: కడప జిల్లాలో ఓ అరుదైన సంఘటన వెలుగులోకి వచ్చింది. పదో తరగతి చదువుతున్న ఓ బాలికకు తెలియకుండా.. ఆమె తల్లిదండ్రులు తనకు బాల్య వివాహం చేసేందుకు నిర్ణయించుకున్నారు. అనుకున్నట్లుగానే పెళ్లి కోసం అన్ని ఏర్పాట్లను చేసుకుంటున్నారు. అయితే విషయం తెలుసుకున్న బాలిక ఈ వ్యవహారంపై నేరుగా వెళ్లి డీఎస్పీకి ధైర్యంగా ఫిర్యాదు చేసింది. డీఎస్పీ దిశ సిబ్బందిని పంపించి బాల్య వివాహానికి చేస్తున్న యత్నాలను అడ్డుకున్నారు. బాలిక తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇచ్చి బాలికను ఇంటికి పంపించారు. వివరాల్లోకి వెళ్తే..
కడప రామకృష్ణ నగర్‌కు చెందిన కేశవకు ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నాడు. వారిలో ఒక అమ్మాయి పదో తరగతి చదువుతోంది. ఆమెకు ఇంకా 18 ఏళ్లు కూడా నిండలేదు. అయితే ఆ బాలికకు తెలియకుండా ఆమెను సమీప బంధువు కుమారుడుకి ఇచ్చి బాల్య వివాహం చేసేందుకు ఆమె తల్లిదండ్రులు ప్రయత్నాలు మొదలు పెట్టారు. అయితే, ఆ బాలికకు ఈ పెళ్లి చేసుకోవటం ఇష్టం లేదు. ఆమెకు చదువుపై ఆసక్తి ఉంది. తల్లిదండ్రులు పెళ్లి చేస్తుండడంతో ఈ విషయం ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాక దిక్కుతోచని స్థితిలో ఆ బాలిక ఉండిపోయింది.