DD Achchenna Murder Case: వైఎస్ఆర్ కడప జిల్లాలో పశుసంవర్ధక శాఖ ఉద్యోగి అచ్చన్న హత్య కేసు విచారణ జరిపించాలని... కడపలో అఖిలపక్షం ఆధ్వర్యంలో చేపట్టిన నిరసన ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు. పలువురు నాయకులను గృహ నిర్బంధం చేసి... టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాస్ రెడ్డిని అరెస్టు చేశారు.
డాక్టర్ అచ్చన్న హత్యకు నిరసనగా కడపలో అఖిలపక్ష పార్టీల ఆధ్వర్యంలో నిరసన ర్యాలీకి పిలుపునిచ్చిన నేపథ్యంలో పోలీసులు ముందస్తు అరెస్ట్లు, గృహనిర్బంధాలు చేపట్టారు. పోలీసుల తీరుపై ప్రతిపక్ష పార్టీలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. నిరసన కార్యక్రమానికి బయల్దేరిన తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు శ్రీనివాస్ రెడ్డి పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీలు వ్యవహరిస్తున్న తీరుపై శ్రీనివాస్ రెడ్డి మండిపడ్డాడు.
వైఎస్ఆర్ కడప జిల్లాలోని పోలీసులతో పాటుగా అధికారులకు జగన్మోహన్ రెడ్డి తన జేబులోనుంచి జీతాలు ఇస్తున్నట్లుగా పోలీసులు, అధికారులు అధికార పార్టీకి వత్తాసు పలుకుతున్నారని శ్రీనివాస్ రెడ్డి ఆరోపించారు. ప్రజాస్వామ్య దేశంలో కనీసం వాక్ స్వాతంత్రం కూడా లేకుండా చేస్తున్నారని ధ్వజమెత్తారు. కడప పశుసంవర్ధక శాఖ డిప్యూటీ డైరెక్టర్ అచ్చన్న హత్యకు నిరసనగా కడపలో అఖిలపక్ష పార్టీల ఆధ్వర్యంలో చేపట్టిన నిరసన ర్యాలీని పోలీసులు ముందస్తుగానే అడ్డుకున్నారు. అఖిలపక్ష పార్టీ నాయకులను గృహనిర్బంధం చేసి వారిని బయటికి రానికుండా చేశారు. అందులో భాగంగా శ్రీనివాస్ రెడ్డి తన కార్యాలయం నుంచి బయటకు వస్తుండగా పోలీసులు ఆయన్ను అరెస్టు చేసి ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లారు.