Cheryala ZPTC Murder Case Update : సంచలనంగా మారిన తెలంగాణ రాష్ట్రం సిద్దిపేట జిల్లా చేర్యాల జడ్పీటీసీ సభ్యుడు మల్లేశం మృతిని.. పోలీసులు హత్యగా తేల్చారు. మొదట రోడ్డు ప్రమాదం అని భావించినప్పటికీ.. శరీరంపై గాయాల ఆధారంగా అనుమానాస్పద మృతిగా పోలీసులు భావించారు. హత్యే అని ప్రాథమికంగా నిర్ధరణకు వచ్చిన పోలీసులు వేగంగా స్పందించారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన సిద్దిపేట పోలీస్ కమిషనర్ శ్వేత.. హంతకులను పట్టుకునేందుకు హుస్నాబాద్ ఏసీపీ సతీశ్ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు.
దర్యాప్తు ప్రారంభించిన ఈ బృందం అనుమానితులపై దృష్టి సారించింది. మల్లేశం స్వగ్రామం గురిజకుంట ఉప సర్పంచ్ సత్యనారాయణతో గత కొంతకాలంగా వివాదాలు నెలకొన్నట్లు పోలీసులు గుర్తించారు. అతనిని, అతని ముఖ్య అనుచరులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిని మద్దూర్ పోలీస్ స్టేషన్‌లో ప్రశ్నించగా.. నేరం అంగీకరించడంతో పాటు హత్యకు ఉపయోగించిన ఆయుధాలు దాచిన వివరాలు సైతం వెల్లడించినట్లు తెలుస్తోంది.