కడప జిల్లా బద్వేలు మండలం చింతలచెరువులో నిన్న సాయంత్రం యువతిని గొంతుకోసి హత్య చేసిన ప్రేమోన్మాది చరణ్ అనే వ్యక్తిని అరెస్ట్(arrest) చేసినట్లు ఎస్పీ అన్బురాజన్ తెలిపారు. గత కొంతకాలంగా ప్రేమించాలని వేధిస్తూ.. యువతి వెంట పడుతున్నాడని, నిన్న తల్లిదండ్రులతో పొలంలో పనిచేస్తున్న యువతి శిరీషపై నిందితుడు ఒక్కసారిగా కత్తితో దాడి చేసి గొంతుకోశాడని ఎస్పీ పేర్కొన్నారు.
యువతిపై దాడి తరువాత ఘటనాస్థలి నుంచి పారిపోయేందుకు ప్రయత్నించిన యువకుడికి స్థానికులు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. ఘటనపై లోతుగా దర్యాప్తు చేస్తుండగా.. నిందితుడు చరణ్‌కు మరో ఇద్దరు యువకులు సహకరించినట్లు తేలిందని ఎస్పీ వెల్లడించారు. వారిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఆయన తెలిపారు.
జిల్లాలో ఎక్కడైనా మహిళలు, అమ్మాయిలను ఎవరైనా వేధిస్తున్నట్లు తేలితే పోలీసులకు సమాచారం ఇవ్వాలని ఎస్పీ విజ్ఞప్తి చేశారు. ఫిర్యాదు చేసిన వారి పేర్లు గోప్యంగా ఉంచడంతోపాటు నిందితులకు కఠినంగా శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామన్నారు. హింసను ప్రేరేపించే విధంగా ఎవరైనా ఇలాంటి అఘాయిత్యాలకు పాల్పడితే కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు.