నకిలీ పత్రాలతో అక్రమ ఇసుక రవాణా చేస్తున్న వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. కడప జిల్లా కొండాపురం మండలంలోని పెన్నా నది నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్న షేక్ మహబూబ్ బాషాతో పాటు మరో పది మంది లారీ డ్రైవర్లను అరెస్ట్ చేశారు. వారి నుంచి ఐదు టిప్పర్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితులు.. పది రోజులగా జయప్రకాశ్ పవర్ వెంచర్ లిమిటెడ్ కంపెనీ పేరుతో నకిలీ బిల్లులు ద్వారా అక్రమ ఇసుక రవాణా చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
ఆ కంపెనీ ఫిర్యాదు మేరకు తనిఖీ చేసి పట్టుకున్నట్లు వివరించారు. తాడిపత్రి స్టీల్ ప్లాంట్ దగ్గర స్టాక్ పాయింట్ ను ఏర్పాటు చేసుకుని అక్కడి నుంచి ఇతర ప్రాంతాలకు అక్రమంగా ఇసుకను రవాణా చేస్తున్నారని చెప్పారు. ఇలా భారీ మొత్తంలో డబ్బులు అక్రమంగా.. చట్ట విరుద్ధంగా సంపాదిస్తున్నారని అన్నారు. నిందితులపై కేసు నమోదు చేసి కోర్టుకు హాజరు పరచనున్నట్టు కొండాపురం సీఐ సుదర్శన్ ప్రసాద్ తెలిపారు.