Achanna murder case: కడప పశుసంవర్ధక శాఖ డిప్యూటీ డైరెక్టర్ అచ్చన్న హత్య కేసు దర్యాప్తు కొనసాగుతోంది. మృతదేహం తన తండ్రిదో.. కాదో అని అతని కుమారుడు క్లింటన్ చక్రవర్తి అనుమానం వ్యక్తం చేయడంతో.. ముందు జాగ్రత్త చర్యగా పోలీసులు కోర్టు అనుమతి తీసుకుని అచ్చన్న కుమారుడు, కుమార్తె రక్త నమూనాలను సేకరించి హైదరాబాదులోని కేంద్ర ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించారు. రాష్ట్రానికి చెందిన ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపిస్తే లేనిపోని అనుమానాలు వస్తాయని ఉద్దేశంతో విచారణ పక్కాగా జరగాలని పోలీసులు కేంద్రానికి చెందిన ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించారు. మృతదేహం పక్కాగా అచ్చన్నదేనని పోలీసులు ధృవీకరించారు.. అయినప్పటికీ అతని కుమారుడు అనుమానం ఉందని చెప్పడంతో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా ఉండాలని ఉద్దేశంతో రక్త నమూనాలను సేకరించినట్లు పోలీసులు చెప్పారు.
అచ్చెన్న ఎవరిపై అయితే ఫిర్యాదు చేశారో.. అలానే అచ్చెన్న కుమారుడు కూడా పోలీసులకు ఫిర్యాదు చేసిన వారందరికీ పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఇదివరకే అచ్చన్న హత్య కేసులో అదే శాఖలో పనిచేస్తున్న సుభాష్ చంద్రబోస్ అనే ఉద్యోగితో పాటు మరో ఇద్దరిని పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. మరి కొంతమంది ఉద్యోగులపై అనుమానం ఉందని అచ్చన్న కుమారుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఆ కోణంలో కూడా విచారణ చేస్తున్నారు. కేంద్ర ఫోరెన్సిక్ ల్యాబ్ నుంచి రిపోర్ట్ రాగానే దర్యాప్తును మరింత వేగవంతం చేస్తామని పోలీసులు చెప్పారు.