వైకాపా అధ్యక్షుడు వైఎస్ జగన్ సొంత జిల్లా కడపలో అధికార, ప్రతిపక్షాలకు.. ఎన్నికలు ప్రతిష్ఠాత్మకమయ్యాయి. పట్టు నిలుపుకోవాలని వైకాపా ప్రయత్నిస్తుంటే... పాగా వేసేందుకు తెలుగుదేశం ఉవ్విళ్లూరుతోంది. ఈ సారి ఎలాగైనా పసుపు జెండా ఎగరేయాలని భావిస్తున్న తెదేపా... తమ అభ్యర్థిగా లింగారెడ్డిని నిలబెట్టింది.2009లో ప్రొద్దుటూరు నుంచి తెదేపా అభ్యర్థిగా పోటీ చేసిన లింగారెడ్డి జయకేతనం ఎగురవేశారు. ఆ సమయంలో జిల్లాలోని మిగతా తొమ్మిది స్థానాల్లో కాంగ్రెస్ జెండా రెపరెపలాడింది. 2014 ఎన్నికల నాటికి.. కాంగ్రెస్ నుంచి సీనియర్ నాయకుడు, 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన అనుభవం ఉన్న వరదరాజులురెడ్డి... తెదేపా గూటికి చేరారు. అప్పుడు లింగారెడ్డిని కాదని.. వరదరాజులును తెదేపా పోటీకి దించింది. వైకాపా జోరుతో ఆయన ఓడిపోయారు. ఈసారి అలాంటి పరిస్థితి రాకుండా ఉండాలని భావించిన తెదేపా అధినేత చంద్రబాబు.. మరోసారి లింగారెడ్డిపై విశ్వాసం ఉంచారు. తనకే అవకాశం ఖాయమని నమ్మకంతో ఉన్న వరదరాజులు రెడ్డి... చంద్రబాబు నిర్ణయంతో కంగుతిన్నారు. లింగారెడ్డికి అవకాశం రావడంపై అలకబూనారు. ఆయన పార్టీ మారతారని చాలామంది అనుకున్నారు. అయినా... భవిష్యత్తులో ఎమ్మెల్సీగా అవకాశం ఇస్తామన్న అధినేత హామీతో మెట్టు దిగారు. శిష్యుడు లింగారెడ్డి విజయానికి విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు.
ఫలించిన ఆదినారాయణ రెడ్డి మధ్యవర్తిత్వం