PM Modi Phone Call to Sharmila: వైఎస్‌ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఫోన్ చేసి పరామర్శించినట్లు సమాచారం. ఇటీవల హైదరాబాద్‌లో వైఎస్ షర్మిలను టోయింగ్ వాహనంలో తీసుకువెళ్లి అరెస్టు చేయడం పట్ల ప్రధాని మోదీ విచారం వ్యక్తం చేయడంతోపాటు సానుభూతి తెలిపినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా ప్రధాని మోదీ రెండు నుంచి మూడు నిమిషాల పాటు షర్మిలతో వాట్సాప్ కాల్‌లో మాట్లాడినట్లు పార్టీ శ్రేణులు తెలిపారు.
ఇదే విషయంపై వైఎస్ షర్మిల ట్యాంక్‌బండ్‌పై అంబేడ్కర్ విగ్రహానికి నివాళులర్పించిన అనంతరం స్పందించారు. తన అరెస్టు పట్ల సానుభూతి తెలిపిన ప్రధాని మోదీకి షర్మిల కృతజ్ఞతలు తెలిపారు. మరోవైపు కేసీఆర్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. కవితమ్మ బతుకమ్మ ఆడుతూనే లిక్కర్ స్కామ్‌కు తెరలేపారని ఆరోపించారు. కేసీఆర్ కుటుంబంలో ఒక్కొక్కరు ఒక్కో నాటకానికి తెర లేపుతున్నారని షర్మిల విమర్శించారు.
ఇదీ జరిగింది..వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలను పోలీసులు అరెస్టు చేశారు. ప్రగతి భవన్ ముట్టడి యత్నాన్ని పోలీసులు భగ్నం చేశారు. వరంగల్‌లో వైతెపా అధ్యక్షురాలు షర్మిల పాదయాత్ర చేస్తున్న క్రమంలో.. ప్రచారం రథంపై దాడి జరిగింది. ఈ దాడిలో కారు అద్దాలు పగిలిపోయాయి. ధ్వంసమైన కారులో షర్మిల ప్రగతి భవన్ ముట్టడికి యత్నించారు. స్వయంగా డ్రైవింగ్ చేసుకుంటూ షర్మిల ప్రగతిభవన్ వైపు వెళ్తుండగా.. పంజాగుట్ట చౌరస్తా వద్ద పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులు షర్మిలను అరెస్టు చేయడానికి ప్రయత్నించగా.. కారులోనే కూర్చుని ఉండిపోయారు. ప్రజా సమస్యలపై పోరాడుతుంటే దాడులు చేస్తున్నారంటూ ఆరోపించారు. పోలీసులు షర్మిలకు సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. ఎంతకీ ఆమె వెనక్కి తగ్గలేదు.
ఈ క్రమంలో రహదారిపై భారీగా వాహనాలు నిలిచిపోయాయి. రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. వాహనదారులు సైతం చాలా ఇబ్బందులు పడ్డారు. పోలీసులు ఆమెను కారులో నుంచి దించే ప్రయత్నం చేయగా.. కారు కిటికీలు మూసేసి ఎంతకూ బయటకు రాలేదు. ఈ క్రమంలో కారుపై కూర్చుని వైతెపా కార్యకర్తలు నిరసన తెలిపారు. వారిని పోలీసులు అరెస్టు చేశారు. 15 మందికి పైగా వైతెపా కార్యకర్తలు, నేతలను బంజారాహిల్స్ పోలీసులు అరెస్టు చేసి స్టేషన్‌కు తీసుకెళ్లారు. ధ్వంసమైన కారు డ్రైవింగ్ సీట్లో షర్మిల కూర్చొని ఉండగానే పోలీసుల క్రేన్‌ను తెప్పించి అక్కడి నుంచి ఎస్‌ఆర్ నగర్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అనంతరం ఆమెను కారులో నుంచి దించి స్టేషన్లోకి తీసుకెళ్లారు.
ఇవీ చదవండి: