కడప జిల్లాలో ఖరీఫ్ సీజన్‌కు 1,21,500 మెట్రిక్ టన్నుల ఎరువులు కావాలని ప్రతిపాదించారు. మే నుంచి సెప్టెంబరు వరకు ఐదు నెలలకుగాను యూరియా 37,500 మెట్రిక్ టన్నులు, డీఏపీ 16,500, మ్యూరేట్ ఆఫ్ పొటాష్ 10,500, మిశ్రమ రకాలు (కాంప్లెక్స్) 44 వేలు, ఎస్‌ఎస్‌పీ 9,500, జీవ వ్యర్థ సేంద్రియ రకం 3,500 మె.టన్నులు కావాలని జిల్లా నుంచి ప్రతిపాదించారు. జిల్లా వ్యాప్తంగా చూస్తే గ్రామీణ ప్రాంతాల్లో రైతు భరోసా కేంద్రాలు 620, పట్టణాల్లో మరో 19 ఏర్పాటు చేసి కర్షకులకు సేవలు అందిస్తున్నారు. గ్రామ వ్యవసాయ, ఉద్యాన సహాయకులు, విస్తరణాధికారులు ఆర్‌బీకేలకు బాధ్యులుగా పనిచేస్తున్నారు.
ఆర్బీకేలను ఇకపై మూడు విభాగాలుగా విభజన చేయాలని రాష్ట్ర ఉన్నతాధికారులు జిల్లా యంత్రాంగాన్ని సోమవారం ఆదేశించారు. ఏ, బీ, సీ కేటగిరీలుగా విభజించనున్నారు. వాటి ఆధారంగా ఆ ప్రాంతంలో ఉన్న భూమి, సాగయ్యే విస్తీర్ణం, ఏ రకాలు పంటలు ఎక్కువగా సాగు చేస్తారు.. మెట్ట, మగాణి, వ్యవసాయ పైర్లు, ఉద్యాన తోటలు ఎంత విస్తీర్ణంలో పండిస్తున్నారని పరిశీలన చేస్తారు. వర్షాధారం, జల వనరులపై ఆధారపడి సాగవుతున్న వివరాలు సేకరించాలి. ఇందుకోసం సమగ్ర సమాచారాన్ని సేకరించి పంపించాలని ఇప్పటికే క్షేత్రస్థాయి యంత్రాంగాన్ని ఆదేశించారు.
జిల్లాకు వచ్చిన రసాయన ఎరువులను మార్క్‌ఫెడ్ ద్వారా ఆర్‌బీకేలకు రవాణా చేస్తున్నారు. జిల్లా కేంద్రంలోని గోదాముల్లో నిల్వ చేసి రైతుల నుంచి వస్తున్న గిరాకీని చూసి ఆయా ప్రాంతాలకు పంపిస్తున్నారు. ఇలా చేయడంతో కావాల్సిన రకాలకు డబ్బులు చెల్లించిన రైతులకు సకాలంలో చేరడం లేదు. వారం, పది రోజుల పాటు నిరీక్షించాల్సి వచ్చేది. దీంతో పంటలకు అవసరమైన సమయంలో ఎరువులు వేయలేని పరిస్థితి తలెత్తేది. కర్షకుల నుంచి అందిన ఫిర్యాదులను పరిశీలించి ఉన్నతాధికారులు తాజాగా ఈ నిర్ణయం తీసుకొన్నారు. ప్రతి రైతు భరోసా కేంద్రంలో కనీసం 5 మెట్రిక్ టన్నుల ఎరువులు నిల్వ చేయాలని ఉన్నతస్థాయి నుంచి ఉత్తర్వులు అందాయి. జిల్లాలో కొన్నిచోట్ల కియోస్క్ యంత్రాలు లేవు. మరికొన్నింట్లో ఉన్నప్పటికీ సాంకేతిక, అంతర్జాల సమస్యతో పనిచేయడం లేదు. ఈ సమస్యను పరిష్కరించి అన్నిచోట్లా వాటిని వినియోగంలోకి తీసుకురావాల్సి ఉంది.